ఈఎస్‌ఐ కేసులో అరెస్టయి, గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి, తెదేపా సీనియర్ నేత అచ్చెన్నాయుడిని బుధవారం సాయంత్రం డిశ్ఛార్జి చేశారు. చక్రాల కుర్చీపై అంబులెన్సులో ఎక్కించి, నేరుగా విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. ఏసీబీ న్యాయస్థానం ఆదేశాల మేరకు జూన్ 13న మాజీమంత్రిని గుంటూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చేర్చారు. ఆయనకు గతంలో చేసిన శస్త్రచికిత్స గాయం తిరగబెట్టడంతో వైద్యులు మరో రెండు శస్త్రచికిత్సలు చేశారు. చిన్నపేగు చివరిభాగంలో పుండులాగా ఉండటంతో మంగళవారం నమూనాను తీసి బయాప్సీకి పంపారు. సూపరింటెండెంట్ ఆచార్య కె.సుధాకర్ ఇటీవలే అచ్చెన్నాయుడి ఆరోగ్యాన్ని పర్యవేక్షించేందుకు నలుగురు వైద్య నిపుణులతో బృందాన్ని ఏర్పాటుచేశారు. వారు రోజూ నివేదిక ఇస్తున్నారు. బుధవారం అల్ట్రాసౌండ్ స్కాన్, ఎక్స్‌రే, రక్తపరీక్షలు నిర్వహించగా అన్నీ సాధారణంగానే వచ్చాయన్నారు. దాంతో వైద్యబృందంతో సూపరింటెండెంట్ సమీక్షించి, న్యాయమూర్తికి నివేదిక పంపినట్లు తెలిసింది.
గుంటూరు జీజీహెచ్ నుంచి అచ్చెన్న డిశ్ఛార్జి.. విజయవాడ కారాగారానికి తరలింపు - మాజీ మంత్రి అచ్చెన్న అరెస్ట్ వ్యవహారం
18:05 July 01
జైలుకు అచ్చెన్నాయుడు
పది రోజులుగా కడుపులో మంట, రక్తవిరేచనాలతో బాధపడుతున్నట్లు అచ్చెన్న ఆసుపత్రి పర్యవేక్షకుడికి బుధవారం లేఖ రాసినట్లు తెదేపా వర్గాలు తెలిపాయి. 'అనారోగ్యంతో ఉన్నట్లు వైద్యులకు చెబితే మంగళవారం కొలనోస్కోపీ చేశారు. నివేదిక వచ్చాక మందులు ఇస్తామన్నారు. ఇప్పటికీ కడుపులో మంట, జలుబు, దగ్గుతో బాధపడుతున్నా. కొలనోస్కోపీ నివేదిక రాకుండానే డిశ్ఛార్జి చేస్తున్నారు. కొవిడ్ పరీక్ష చేయాలన్నా పట్టించుకోలేదు' అంటూ లేఖలో పేర్కొన్నట్లు తెలిసింది.
*అచ్చెన్నాయుడిని జైలుకు తరలిస్తుండగా మాజీ మంత్రులు దేవినేని ఉమా, నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజేంద్రప్రసాద్, గుంటూరు జిల్లా నేతలు జి.వి ఆంజనేయులు, మహమ్మద్ నసీర్‌తోపాటు పలువురు కార్యకర్తలు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. వాహనాలను అడ్డుకునే ప్రయత్నం చేసిన తెదేపా శ్రేణులను పోలీసులు పక్కకు నెట్టేశారు.
- కారాగారంలో ఉంచడం మంచిదికాదు: న్యాయవాది లూత్రా
తనకు బెయిల్ ఇప్పించాలంటూ అచ్చెన్నాయుడు పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై బుధవారం విజయవాడ అనిశా కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో వాదనలు ముగిశాయి. మొదట అచ్చెన్న తరఫు సుప్రీంకోర్టు సీˆనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపిస్తూ... అచ్చెన్నాయుడ్ని అరెస్ట్ చేసి 20 రోజులు గడిచిందని, పోలీసు కస్టడీ పూర్తయిందన్నారు. పిటిషనర్ ఆరోగ్యస్థితి బాగా లేదని, కరోనా కాలంలో కారాగారంలో ఉంచడం మంచిదికాదన్నారు. అనిశా తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపిస్తూ దర్యాప్తు ఇంకా పెండింగ్‌లో ఉందని, మరిన్ని సాక్ష్యాలను సమీకరించాల్సి ఉందన్నారు. న్యాయాధికారి తన నిర్ణయాన్ని శుక్రవారానికి వాయిదా వేశారు.
ఇవీ చదవండి:అచ్చెన్నాయుడి ఆరోగ్యంతో ప్రభుత్వం చెలగాటం:చంద్రబాబు