CM Jagan on Party strengthening: ‘ఇన్ని బటన్లు నొక్కి ఈ మూడేళ్లలో రూ.1.37లక్షల కోట్లను ఇచ్చాం. ఈ ఏడాది రూ.55 వేల కోట్లు... వచ్చే ఏడాది మరో రూ.55వేల కోట్లు ఇవ్వనున్నాం. అంటే మొత్తంగా దాదాపు రూ.2.50లక్షల కోట్లవుతుంది. ఇంత గొప్పగా చేసిన తర్వాత కూడా గతంలో వచ్చిన 151 సీట్లకు ఇప్పుడు తగ్గకూడదు కదా! 151 ఎందుకు? మొత్తం 175కి 175 స్థానాలూ ఎందుకు రాకూడదు...’అని వైకాపా అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. ‘గత ఎన్నికలకు వచ్చే ఎన్నికలకు తేడా లేదా? గత ఎన్నికల్లో కుప్పం మనకు రాలేదు. ఇప్పుడు కుప్పం మునిసిపాలిటీతో సహా అక్కడ స్థానిక సంస్థలను గెలిచాం.
పార్టీ పరంగా జరగాల్సినవి, ప్రభుత్వ పరంగా మనం చేసిన మంచిని సమర్థంగా ప్రజల్లోకి తీసుకువెళ్లి వారిని చైతన్యపరచడమనేది సరిగా చేస్తే 175 స్థానాలు ఎందుకు రావు...’అని ఆయన పేర్కొన్నారు. బుధవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మంత్రులు, వైకాపా ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘లంచం, అవినీతి, వివక్ష లేకుండా బటన్ నొక్కి ఇచ్చేస్తున్నాం. రాష్ట్ర, దేశ చరిత్రలో వెతికినా ఇలాంటిది కనిపించదు. 151 స్థానాలకు తగ్గరాదు. 175 స్థానాలు సాధించేలా మంత్రులు, సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు బాధ్యత తీసుకోవాలి....’అని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...
పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులే మీ కంటే ఎక్కువ అనే విషయాన్ని మంత్రులు గుర్తు పెట్టుకోవాలి. అధ్యక్షులు సుప్రీమ్. పార్టీనే బాస్. ఆ తర్వాతనే మీరు. జిల్లా అధ్యక్షులను మీరు (మంత్రులు) గౌరవించాలి, మీరు గౌరవిస్తేనే జిల్లా యంత్రాంగం వారికి సహకరిస్తుంది. పార్టీనిగెలిపిస్తే జిల్లా అధ్యక్షులేరేపు మంత్రులు అవుతారు. త్వరలోనే వారిని జిల్లా అభివృద్ధి మండళ్లకు ఛైర్మన్లను చేసి... వారికి కేబినెట్ హోదా ఇవ్వనున్నాం. ఎమ్మెల్యేల్లాగానే మంత్రులూ గడప గడపకు వెళ్లాలి.
మే నుంచి గేర్ మారుస్తున్నాం
కళ్లు మూసుకుని తెరిచేసరికి రెండేళ్లు పూర్తవుతుంది. ఆ తర్వాత జరిగే ఎన్నికలకు ఇప్పటి నుంచే సరైన అడుగులేస్తేనే మనం అధికారంలో కొనసాగుతాం. గత ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలు వచ్చేలా పనిచేయాలి. నమ్మకమే వాస్తవం కంటే ఎప్పుడూ శక్తిమంతమైనదంటారు. ఇప్పుడు వాస్తవాన్నే శక్తిమంతమైనదిగా మనం సృష్టించి ఎన్నికలకు వెళుతున్నాం. మేనిఫెస్టోలో 95 శాతం హామీలను నెరవేర్చి, నెరవేరుస్తూ ఎన్నికలకు వెళుతున్నాం. వివిధ పథకాలకు ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) పంపిణీ చేశాం. గతంలో రాష్ట్రంలో లేదా దేశంలో ఈ స్థాయిలో చేశారా అన్నది నాకు అనుమానమే. మే నుంచి గేర్ మారుస్తున్నాం. ఈ మూడేళ్లలో మనం ఏం చేశామన్నది ప్రజల్లోకి వెళ్లి చెప్పేందుకే ‘గడప గడపకు’ వెళ్లే కార్యక్రమాన్ని మే 10 నుంచి చేపట్టాలి. ఇది పూర్తయ్యేందుకు కనీసం 8 నుంచి 9 నెలలు పడుతుంది. ఇది అధికారిక కార్యక్రమమే. పని తీరులో కొంతమంది ఎమ్మెల్యేలే ముందంజలో ఉన్నారు. చాలా మంది మధ్య స్థాయిలో, 10-15 శాతం మంది తక్కువ స్థాయిలో ఉన్నారు. తక్కువ, మధ్య స్థాయి ఎమ్మెల్యేలు ‘గడప గడపకు’ పూర్తిగా తిరగడం ద్వారా వారి గ్రాఫ్‌ను పెంచుకోవాలి. వారందరికీ ఇదో అవకాశం. అప్పటికీ మార్చుకోకపోతే చేసేదేమీ ఉండదు.
ఇంటింటికీ మూడు కరపత్రాలు, ఒక లేఖ