ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

''గొడవల సంస్కృతిని.. జగన్​ రాష్ట్రమంతా విస్తరిస్తున్నారు'' - గొడవల సంస్కృతి

రాష్ట్ర వ్యాప్తంగా చలో ఆత్మకూరు పేరుతో పెద్ద ఎత్తున నిరసనలు జరిగినా... సీఎం హోదాలో ఉన్న వ్యక్తి స్పందించకపోవటం శోచనీయమని తెదేపా అధినేత చంద్రబాబు ఆక్షేపించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి.. అవినీతి నిర్మూలన చేస్తానంటున్నారని ఎద్దేవా చేశారు.

గొడవల సంస్కృతిని జగన్​ రాష్ట్రం మొత్తం విస్తరిస్తున్నారు : చంద్రబాబు

By

Published : Sep 12, 2019, 10:59 PM IST

Updated : Sep 12, 2019, 11:31 PM IST

గొడవల సంస్కృతిని జగన్​ రాష్ట్రం మొత్తం విస్తరిస్తున్నారు : చంద్రబాబు

ముఖ్యమంత్రి జగన్​పై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో సీఎంలకు ఫాక్షన్ నేపథ్యం ఉన్నా.. ఆ గొడవలను వారి జిల్లాలకే పరిమితం చేశారని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. వైఎస్ రాజశేఖర్​ రెడ్డి... పరిటాల రవీంద్ర అంశంలో జోక్యం చేసుకున్నా.. అవి సీమకే పరిమితం అయ్యాయన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ మాత్రం ఫాక్షన్ సంస్కృతిని రాష్ట్రం మొత్తం విస్తరిస్తున్నారని ఆరోపించారు.

లక్ష కోట్ల అవినీతి అభియోగాలున్న వ్యక్తే అవినీతి లేకుండా చేస్తానని చెప్పుకోవటం హాస్యాస్పదమని చంద్రబాబు ఎద్దేవా చేశారు. దేశాన్ని బాగు చేయాలని తనను దేవుడే పంపించాడంటూ జగన్ చెబుతున్న మాటలు వినాల్సి రావడం రాష్ట్రప్రజల దౌర్భగ్యామన్నారు. కోర్టులకు హాజరు కాకుండా మినహాయింపులు కోరే వ్యక్తి నోట నీతి వాక్యాలు వినాల్సి వస్తుందని మండిపడ్డారు.

బుధవారం రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ప్రజాగ్రహం వెల్లువెత్తితే.. ముఖ్యమంత్రి ఎందుకు స్పందించలేదని చంద్రబాబు నిలదీశారు. సీఎంకు రాష్ట్ర శాంతి భద్రతలు పట్టవని ఆరోపించారు. బాధితులకు న్యాయం జరిగేలా... నిందితులపై ఎందుకు చర్యలకు తీసుకోలేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి కనీసం స్పందించకపోవటం గర్హనీయమని ఆక్షేపించారు.

పీపీఏలపై కేంద్రం, కోర్టులు, విదేశాలు.. రాష్ట్రప్రభుత్వ తీరును తప్పుబడుతున్నా.. సీఎం స్పందించకపోవటంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతితో పాటు ఏ ఒక్క అంశంపైనైనా.. సీఎం స్పందించరా అని నిలదీశారు. గుంటూరు తెదేపా కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతలతో సమావేశమైన చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా జరిగిన చలో ఆత్మకూరు నిరసనల్లో 7,165 మంది తెదేపా నాయకులు పాల్గొన్నారని నేతలు చంద్రబాబుకు తెలిపారు. వారిలో 1,780 మంది తెదేపా కార్యకర్తలు, నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారని, 75మందిని గృహనిర్బంధం, 32మందిపై బైండోవర్ కేసులు పెట్టినట్లు నేతలు అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు.

ఇదీ చదవండి:

బొత్స రోజుకో రకంగా మాట్లాడుతున్నారు: నక్కా ఆనందబాబు

Last Updated : Sep 12, 2019, 11:31 PM IST

ABOUT THE AUTHOR

...view details