ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక వ్యవస్థ, విద్యుత్ పంపిణీ సంస్థ కుదేలయ్యాయని భాజపా రాష్ట్ర వ్యవహారాల సహ ఇంఛార్జీ సునీల్ దేవధర్ విమర్శించారు. గుంటూరులో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఆయన.. పేద మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అంతరాయలు లేకుండా కరెంట్ ఇవ్వటంలో ముఖ్యమంత్రి జగన్ విఫలమయ్యారని ఆరోపించారు. విద్యుత్ కొరతతో పరిశ్రమలు మూతపడే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే అప్పుల్లో ఉన్న రాష్ట్రం.. వైకాపా విధానాల వల్ల మరింతగా అప్పుల్లోకి కూరుకుపోతుందని వ్యాఖ్యానించారు. ప్రజలపై పన్నుల భారం పెంచి ప్రభుత్వం పబ్బం గడుపుకుంటోందని ఆరోపించారు.
ప్రజలపై భారం పెంచి.. ప్రభుత్వం పబ్బం గడుపుకుంటోంది: సునీల్ దేవధర్ - భాజపా ఆధ్వర్యంలో మహిళలకు కుట్టుమిషన్ల పంపిణీ
వైకాపా ప్రభుత్వంపై భాజపా రాష్ట్ర వ్యవహారాల సహ ఇంఛార్జీ సునీల్ దేవధర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజలపై పన్నుల భారం పెంచి ప్రభుత్వం పబ్బం గడుపుకుంటోందని ఆయన ఆరోపించారు. నిరంతర విద్యుత్ సరఫరా చేయడంలో ముఖ్యమంత్రి జగన్ విఫలమయ్యారని ఆరోపించారు. గుంటూరులో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
రాష్ట్రంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇసుక మాఫియాగా మారారని సునీల్ దేవధర్ దుయ్యబట్టారు. ఇక భూ దందాలు, మద్యం మాఫియాకు అంతే లేదన్నారు. ప్రభుత్వ పథకాలు ఆపేస్తామని వాలంటీర్ల ద్వారా బెదిరించడం వల్లే స్థానిక ఎన్నికలు, ఉప ఎన్నికల్లో వైకాపా గెలిచిందన్నారు. సాధారణ ఎన్నికల కోసం రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారని.. భాజపా- జనసేన ఉమ్మడిగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:RTC Charges hike: ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపునకు రంగం సిద్ధం