గుంటూరులోని కొత్తపేట, పట్టాభిపురం, పాతగుంటూరు, నగరంపాలెం పోలీసు స్టేషన్ల పరిధిలో ద్విచక్ర వాహనాల చోరీ గుట్టును పోలీసులు రట్టు చేశారు. నిందితుడు ఇంజినీరింగ్ పూర్తి చేసి ఖాళీగా తిరుగుతున్న వెలువోలు వెంకటేశ్‌గా గుర్తించారు. అరెస్టు చేసిన పోలీసులు 20 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి వెల్లడించారు.
ఇంజినీరింగ్ పట్టభద్రుడు... చోరీల బాట పట్టాడు! - engineering graduate commits theft
అతను కొన్నేళ్ల క్రితం సివిల్ ఇంజినీరింగ్ విజయవంతంగా పూర్తి చేశాడు. చదువుకు తగ్గట్లుగానే పలు నిర్మాణ సంస్థల్లో ఉద్యోగం చేశాడు. అయితే చెడు వ్యసనాలకు బానిసైన అతను.... చోరీల బాటపట్టాడు. ఏకంగా 20 ద్విచక్ర వాహనాలను దొంగిలించాడు. వాటిని విక్రయించే ప్రయత్నంలో పోలీసులకు చిక్కాడు.
2012లో సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన వెంకటేశ్... ఒడిశా, పూణే, నల్గొండలోని పలు నిర్మాణ సంస్థల్లో పని చేశాడు. చెడు అలవాట్లతో దారి తప్పాడు. గతంలో గుంటూరులోని రాజీవ్ గృహ ఫ్లాట్ల కేటాయింపుల్లో కూడా ఇతనిపై కేసు నమోదైంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉద్యోగం మానేసిన ఇతను... లాక్‌డౌన్ నేపథ్యంలో సరైన ఆదాయం లేక ద్విచక్ర వాహనాల చోరీకి దిగాడు.
ఇళ్లు, కార్యాలయాల ముందు నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనాలను రెక్కీ చేసి నకిలీ తాళంతో చాకచక్యంగా అపహరించేవాడు. ఇలా ఓ వాహనం అమ్ముతుండగా తమకు అందిన సమాచారంతో అతనిని పట్టుకున్నామని పోలీసులు వెల్లడించారు. ఇళ్ల ముందు ద్విచక్ర వాహనాలను ఉంచే వారు... హ్యాండ్ లాక్‌తో పాటు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.