ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విజయానికి దారి.. ఉభయ గోదారి! - తూర్పు గోదావరి జిల్లా

ఉభయ గోదావరి జిల్లాల్లో పొలిటికల్ పందెం కోళ్లు కత్తులు దూస్తున్నాయి. త్రిముఖ పోటీతో గోదారి లంకల్లో రాజకీయం రంజుగా మారింది. తెదేపాది అభివృద్ధి మంత్రం... వైకాపా అధికారం కోసం పోరాటం.. జనసేన సామాజికవర్గంపై  నమ్మకం. స్థూలంగా ఇదే ఉభయగోదావరి రాజకీయం. దాదాపుగా ఎప్పుడూ ఒకే విధంగా స్పందించే గోదావరి జిల్లాలు ఎటువైపు మొగ్గితే అధికారం ఆ వైపునకు దగ్గరవుతుంది. దీంతో గోదారి గాలులు  తూర్పు, పశ్చిమ గాలి ఎటు వీస్తోందని రాజకీయ పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి.

ubhaya godavari

By

Published : Apr 5, 2019, 5:30 PM IST

Updated : Apr 5, 2019, 11:48 PM IST

తూర్పుగాలి ఎటు వీస్తోంది..?

రాజకీయ చైతన్యానికి మారుపేరు గోదావరి జిల్లాలు. అధికారంలోకి రావడంలో ఈ ఉభయగోదావరి ఓట్లే కీలకం.
19 శాసన సభ, 3 పార్లమెంటు స్థానాలున్న తూర్పుగాలి ఎటువీస్తే రాష్ట్రంలో దాదాపుగా వారిదే ప్రభుత్వం. ఆవిర్భావం నుంచి తూర్పు గోదావరి జిల్లా ప్రజలు తెలుగుదేశంను ఆదరిస్తున్నారు. 2014లో 12స్థానాలను తెలుగుదేశం దక్కించుకుంది. తెదేపా మద్దతులో భాజపా ఒక్క స్థానం, తెదేపా రెబల్‌ అభ్యర్ధి మరో స్థానంలో గెలుపొందారు. వైకాపా కేవలం 5 స్థానాలకే పరిమితమైంది. ఆ తర్వాత వైకాపా ఎమ్మెల్యేల్లో జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావు, వంతల రాజేశ్వరి తెలుగుదేశం వైపు వచ్చేశారు. కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం మూడు లోక్‌సభ స్థానాల్లోనూ తెలుగుదేశం అభ్యర్థులే జయకేతనం ఎగరేశారు. ఈసారి శాసనసభ స్థానాలన్నీ సిట్టింగ్​లకే కేటాయించడం అనుకూలంగా మారింది. ఎంపీ అభ్యర్థుల్ని మూడు చోట్ల కొత్త వారికే చోటు కల్పించింది.

సంక్షేమ పథకాలే శ్రీరామరక్ష

సంక్షేమ పథకాల అమలులో తూర్పుగోదావరి జిల్లా ముందు వరుసలో నిలిచింది. పింఛన్లు, రేషన్ పంపిణీ, పేదల గృహ నిర్మాణం, నూరు శాతం ఎల్ ఈ డీ బల్బులు, బహిరంగ మల విసర్జన రహిత జిల్లా, గ్రామాల్లో సీసీ రహదారుల నిర్మాణం, తాగు నీటి పంపిణీ, యువతకు ఉపాధి, ఉద్యోగాలపై శిక్షణ తెదేపాకు అనుకూలంగా మారనున్నాయి. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ఫలాలు మెట్ట రైతులకు అందనున్నాయి. గోదావరి డెల్టాకు జూన్ మొదటి వారంలోనే నీటి విడదల చేసింది. కాపు సామాజిక వర్గానికి కార్పొరేషన్ ఏర్పాటు ద్వారా వెయ్యి కోట్ల రుణాలు, 5 శాతం రిజర్వేషన్ల ఘనతా కూడా తెలుగుదేశం పార్టీకే దక్కింది. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు రెట్టింపు, పసుపు కుంకుమ, గృహాలు పొందిన లబ్ధిదారులు తెదేపా వైపు మొగ్గు చూపడం ఆ పార్టీకి కలిచొచ్చే అంశం.

పశ్చిమలో పాగా వేసేదెవరు..?

పశ్చిమ గోదావరిజిల్లా తెదేపాకు కంచుకోట. కిందటి ఎన్నికల్లో రెండు పార్లమెంటు, 15అసెంబ్లీ స్థానాలు తెదేపా కూటమి కైవసం చేసుకొంది. వైకాపా కనీసం బోణి కూడా చేయలేదు. తెదేపా ఆవిర్భావం తర్వాత.. ఎనిమిది సార్లు ఎన్నికలు జరిగితే...ఆరు సార్లు అత్యధిక స్థానాలు తెదేపానే కైవసం చేసుకొంది. 1983నుంచి వరుసగా జరిగిన ఎన్నికల్లో తెదేపా 15, 16, 8,16,13,14,4,15 అసెంబ్లీ స్థానాలు దక్కించుకుంది. ఇప్పుడు 15అసెంబ్లీ స్థానాల్లోను తెదేపా, వైకాపాల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. నరసాపురం, ఏలూరు పార్లమెంటు స్థానాల్లో ఉత్కంఠపోరు కొనసాగుతోంది. సింహభాగం అసెంబ్లీ స్థానాల్లో తెదేపా బలంగా ఉంది.

డెల్టాలో డీలా పడ్డ వైకాపా

ప్రస్తుతం డెల్టాలోని స్థానాల్లో పాలకొల్లు, నరసాపురం, ఉండి, తాడేపల్లిగూడెం, తణుకుల్లో తెదేపా ధాటికి వైకాపా డీలా పడుతోంది. పశ్చిమ డెల్టాలోని 7నియోజవర్గాల్లో తెదేపా గాలి వీస్తోంది. భీమవరంలో పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో త్రిముఖ పోటీ నెలకొంది. ఏలూరు పార్లమెంటు స్థానం పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లోను తెదేపా బలంగా ఉంది. ఈ ఐదేళ్లకాలంలో తెదేపా అనేక అభివృద్ధి కార్యాక్రమాలతోపాటు.. సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. పట్టిసీమతో జిల్లాలో లక్షఎకరాల ఆయకట్టుకు నీరందించారు. పశ్చిమడెల్టాకు నీరందించడంలో ప్రభుత్వం విజయం సాధించింది. ఒక్క ఎకరాకు ఎండిపోకుండా రెండు పంటలకు నీరందించడంపై రైతుల్లో ఆనందం వెల్లి విరుస్తోంది.

కిందటి ఎన్నికల్లో జిల్లాలో తుడిచిపెట్టుకు పోయిన వైకాపా.. తన బలాన్ని పెంచుకోవడానికి అంతగా ప్రయత్నాలు ఏమీ చేయలేదు. ప్రజా పోరాటాల్లో జనంలోకి వెళ్లింది కూడా లేదు. కేవలం జగన్ ఇమేజ్ పైనే జనంలోకి వెళుతోంది. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో దిగిన జనసేన మాత్రం తన ముద్ర వేసుకోవడంపై దృష్టిసారించింది. భాజపా, కాంగ్రెస్ పార్టీలు కూడా ఎన్నికల బరిలో నిలనిచినా....వాటి ప్రభావం నామమాత్రంగా మారనుంది.

Last Updated : Apr 5, 2019, 11:48 PM IST

ABOUT THE AUTHOR

...view details