ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Roads Damage: అధ్వాన్నంగా రహదారులు.. ఇబ్బందుల్లో వాహనదారులు

పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రధాన, గ్రామీణ రహదారులు గోతులమయంగా మారాయి. ఓ మోస్తరు వర్షానికే బురదమయమై.. ప్రయాణికులకు నరకం చూపిస్తున్నాయి. గుంతల రోడ్లపై రాత్రిళ్లు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. పల్లె నుంచి పట్నం వరకు రహదారుల దుస్థితి అధ్వాన్నంగా తయారైంది.

By

Published : Aug 31, 2021, 8:45 PM IST

అధ్వాన్నంగా రహదారులు..ఇబ్బందుల్లో వాహనదారులు
అధ్వాన్నంగా రహదారులు..ఇబ్బందుల్లో వాహనదారులు

అధ్వాన్నంగా రహదారులు..ఇబ్బందుల్లో వాహనదారులు

పశ్చిమ గోదావరి జిల్లాలో అధ్వాన రోడ్లు.. ప్రమాదాలకు నెలవుగా మారుతున్నాయి. గుంతలతో, బురదతో నిండిన రహదారులు ప్రయాణికులకు నరకం చూపిస్తున్నాయి. అడపాదడపా కురుస్తున్న వర్షాలకే గ్రామీణ రహదారులన్నీ చిధ్రమైపోయాయి. రహదారుల్లోని గుంతలు మురుగునీటి తటాకాలను తలపిస్తున్నాయి. చినుకు పడితే చాలు రహదారులు చిత్తడిగా మారుతున్నాయి. గోతులమయమైన రహదారుతో ప్రమాదాలు చోటుచేసుకొంటున్నాయి. ఆరు నెలల కాలంలో జిల్లాలో రహదారి ప్రమాదాల్లో 27 మంది మృతి చెందారు. దాదాపు 123 మంది క్షతగాత్రులయ్యారు. ఈ లెక్కలు చాలు జిల్లాలో రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉందో చెప్పటానికి.

ప్రయాణికులకు నరకం

పశ్చిమ గోదావరి డెల్టాలో ఏలూరు నుంచి కైకలూరు వెళ్లే 22 కిలోమీటర్ల రహదారి.. ప్రయాణికులకు నరకాన్ని చూపిస్తోంది. ఉండి, భీమవరం, పాలకొల్లు మీదుగా నరసాపురం వెళ్లే ఈ రహదారి గోతులతో నిండింది. ఆక్వా ఉత్పత్తులను ఈ రహదారిలో రవాణా చేస్తారు. భీమవరం, ఉండి, ఆకివీడు ప్రాంతాల్లో ఆక్వా ప్రొసెసింగ్ యూనిట్లు ఉన్నాయి. ఈ ప్రొసెసింగ్ యూనిట్లకు రొయ్యలు రవాణా చేస్తారు. రహదారిలో గోతులు ఉండటం వల్ల.. రొయ్యల రవాణాకు ఇబ్బందికరంగా మారిందని ఆక్వా రైతులు వాపోతున్నారు. బస్సులు, ప్రైవేటు వాహనాలు గోతుల్లో ఇరుక్కోవటంతో ఎక్కడికక్కడే నిలిచిపోతున్నాయని వాహన చోదకులు అంటున్నారు.

రహదారులు గోతులమయం

ప్రధాన పట్టణాలను కలిపే రహదారులు సైతం దెబ్బతిన్నాయి. ఏలూరు నుంచి చింతలపూడి, జంగారెడ్డిగూడెం రహదారిలో రెండు, మూడు అడుగుల మేర గోతులు ఏర్పడ్డాయి. జంగారెడ్డిగూడెం నుంచి చింతలపూడి, కొయ్యలగూడెం, గోపాలపురం రహదారుల్లో వర్షాలకు రెండు, మూడు అడుగుల మేర నీరు నిలుస్తోంది. జిల్లాలో సుమారు 2,135 కిలోమీటర్ల మేర రహదారులు ఉంటే.. వీటిలో 60 శాతం రహదారులు దెబ్బతిన్నాయి. ఏలూరు నుంచి జంగారెడ్డిగూడెం, చింతలపూడి, కొయ్యలగూడెం, బుట్టాయగూడెం, పోలవరం, జీలుగుమిల్లి, పాలకొల్లు నుంచి తణుకు, అత్తిలి, తాడేపల్లిగూడెం,భీమవరం,నారాయణపురం రహదారుల అధ్వాన్నంగా తయారయ్యాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రహదారులు నిర్మించకపోవటం, నాణ్యత ప్రమాణాలు పాటించపోవడం వల్ల జిల్లాలో రహదారులు గోతులమయంగా మారుతున్నాయి.

అధికారుల నిర్లక్ష్యం

ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌, జడ్పీ పరిధిలోని రోడ్ల నిర్వహణపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. ఆర్‌ఆర్‌ఎం నిధులతో జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడా మరమ్మతులు చేయించినా అవి కాంట్రాక్టులకు - అధికారులకు లబ్ధి చేకూరేలా ఉన్నాయే కాని రోడ్ల పరిస్థితి మారలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. దీంతో మరమ్మత్తులు చేపట్టిన నెలల్లోనే రోడ్లు పాడవుతున్నాయంటున్నారు. గ్రామీణ రోడ్లకు ఎప్పటి కప్పుడు తాత్కాలికంగా అతుకులు వేస్తున్నారే కాని శాశ్వతంగా రోడ్లు నిర్మాణం చేపట్టడం లేదని వాపోతున్నారు. కనీసం గోతులైన పూడ్చి ప్రమాదాలను నిలువరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఇదీ చదవండి:

AP - TS Water Disputes: రేపే 2 బోర్డుల కీలక భేటీ.. నిలదీసేందుకు రాష్ట్ర అధికారులు సిద్ధం!

ABOUT THE AUTHOR

...view details