Victims families: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో నాటుసారా తాగి 18 మంది మృతి చెందినా.. వారందరివీ సహజ మరణాలుగా నిరూపించాలని ప్రభుత్వం తంటాలు పడుతోంది. సహజ మరణాలేనని మీడియా ముందు చెప్పాలని బాధిత కుటుంబసభ్యులపై అధికారులు ఒత్తిడి పెంచుతున్నారు. మరణాలు వెలుగుచూసినప్పటి నుంచీ S.E.B. అధికారులు, పోలీసులు.. పదుల సంఖ్యలో తయారీదారులు, విక్రేతలపై కేసులు నమోదు చేశారు. అదే సమయంలో... తమవారివి సహజ మరణాలేనని మీడియా ముందు చెప్పాలంటూ.. బాధిత కుటుంబాలపై ఒత్తిడి పెంచుతున్నారు. సారా చావుల్ని సహజ మరణాలుగా చూపేందుకు అధికారులు విశ్వప్రయత్నం చేస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
'నాతో పాటు నాటుసారా వల్ల అండ కోల్పోయిన 12 కుటుంబాల వారిని ఏలూరుకు తీసుకెళ్లారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ అక్కడే ఉన్నాం. మాకు భోజనం పెట్టారు. ఒక్కో కుటుంబానికి ఒక్కో వీఆర్వోను కేటాయించి మావాళ్లు చనిపోయిన రోజు ఏం జరిగిందో, వారు ఎలా మరణించారో మమ్మల్ని అడిగారు. నాటుసారా వల్లే మావాళ్లు చనిపోయారని అందరం చెప్పాం. మేం చెప్పినవన్నీ రాసుకున్నారు. మా ఆధార్, బ్యాంకు ఖాతా నంబరు, ఇతర వివరాలు తీసుకున్నారు' ఆ తరువాత.. "మేము మీడియాను పిలుస్తాం. మద్యం తాగే అలవాటుంది.. కానీ తినకుండా ఉండటం వల్లే మావాళ్లు అనారోగ్యానికి గురై చనిపోయారని చెప్పండి. తాగి చనిపోయారంటే నష్టపరిహారం రావడానికి సమయం పడుతుంది. మేం చెప్పినట్లు చెబితే సీఎం దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకునేలా చేస్తాం. మీకు ప్రభుత్వం ఏమన్నా సాయం చేస్తుంది" అని అక్కడుండే ఓ అధికారి మాకు చెప్పారు. అలా అని నిర్బంధం చేయలేదు. "మాకు మీరు ఎలాంటి సాయం చేయకపోయినా ఫరవాలేదు. మావాళ్లను పోగొట్టుకుని ఇంత దూరం వచ్చాం. నిజమే చెబుతాం తప్ప అబద్ధం చెప్పబోం. కల్తీసారా వల్ల మావాళ్లను కోల్పోయి దిక్కుతోచక ఉన్న మాకు సాయం చేస్తే చేయండి. లేదా మమ్మల్ని పంపించేయండి" అని చెప్పి అందరం వచ్చేశాం' -బి.రాంబాబు కుమార్తె
"మాకు మీ డబ్బులొద్దు.. ఏమీ వద్దు.. అలా చెప్పం అన్నాం. సారా మరణాలని చెబితే ప్రభుత్వం నుంచి డబ్బులేమీ రావన్నారు. మా పిల్లలకు మంచి చేస్తారేమోననే ఆశతో వెళితే అబద్ధాలు చెప్పమన్నారు" -పితాని రమణ భార్య విజయలక్ష్మి