అన్నను మించిన తమ్ముడు అనిపించుకుంటారా?
2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి తిరుపతి, పాలకొల్లు నియోజకవర్గాల నుంచి చిరంజీవి పోటీ చేశారు. కానీ తిరుపతిలో మాత్రమే గెలుపొందారు. 2014కు ముందే పార్టీని ప్రారంభించిన పవన్ ..జనసైనికుడిగా తొలిసారి ప్రత్యక్ష పోరులోకి వచ్చారు. గాజువాక, భీమవరం నుంచి బరిలోకి దిగుతున్నారు. పవన్ నియోజకవర్గాల ఎంపిక వెనుక చాలానే కసరత్తు జరిగిందనిస్తుంది. భీమవరం రెండు గోదావరి జిల్లాలకూ దగ్గరగానే ఉంటుంది. ఇటు కృష్ణా జిల్లాకు చెంతనే ఉంటుంది. సంక్రాంతి కోడి పందేలకే కాదు రాజకీయాలకూ భీమవరం ముఖ్య కేంద్రం అటు విశాఖ నగర పరిధిలో ఉన్న గాజువాక కూడా జనసేన అధినేతను ఆకర్షించింది.
సామాజిక వర్గమే శ్రీరామరక్ష
పవన్ సామాజిక వర్గం ఓట్లు భీమవరం నియోజకవర్గంలో 70 వేలకు వరకూ ఉన్నాయి. పవన్ మద్దతుదారులూ పెద్ద సంఖ్యలో ఉన్నారు. కొణిదెల కుటుంబం స్వగ్రామం మొగల్తూరు.. నరసాపురం నియోజకవర్గంలో ఉంది. నరసాపురం, భీమవరం పక్క పక్క నియోజకవర్గాలు. నరసాపురం ఎంపీ స్థానానికి పవన్ సోదరుడు నాగబాబు పోటీ చేస్తున్నారు. తొలి నుంచి పవన్‌కల్యాణ్ భీమవరం కేంద్రంగానే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గాజువాకలో పవన్ సామాజిక వర్గం ఓట్లు 55 వేల వరకూ ఉన్నాయి. గాజువాక పరిధిలో 58 వేల పైచిలుకు ప్రజలు జనసేన సభ్యత్వం తీసుకున్నారు. 2009లో గాజువాకలో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. ఈ కారణాలతో పవన్ ఈ రెండు స్థానాలను ఎంపిక చేసుకున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.