National flags : కృష్ణాజిల్లా బాపులపాడు మండలం మల్లవల్లికి చెందిన సుభాని.. ఏలూరుకు వలస వచ్చారు. తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ దర్జీ వృత్తిలో స్థిరపడ్డారు. చిన్నప్పటి నుంచి జాతీయ జెండా అన్నా.. దాని రూపకర్త పింగళి వెంకయ్య అన్నా.. సుభానికి ఎంతో ఇష్టం. ఆ అభిమానంతోనే జాతీయ జెండాను అమ్మకూడదు.. కొనకూడదు.. అనే ఉద్దేశంతో కొన్నేళ్లుగా జెండాలను స్వయంగా కుడుతూ.. ఉచితంగా పంచుతున్నారు. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలతోపాటు ఎవరు వచ్చి అడిగినా.. లేదనకుండా అందరికీ జెండాలను అందిస్తున్నారు.
ప్రముఖ గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావుకి అభిమానైన సుభాని.. ఆయన స్ఫూర్తితో దేశభక్తి గీతాలు ఆలపించడం ప్రారంభించారు. జాతీయ స్ఫూర్తిని రగిలించేలా.. జెండాపై పాటలు రాయించుకుని స్వయంగా స్వరపరిచి పలు వేదికలపై ప్రదర్శిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. ఉపాధ్యాయుల ఆహ్వానంపై పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు జాతీయ జెండా ప్రాశస్త్యాన్ని తెలియజేయడంతోపాటు జెండా రూపకల్పనలో పింగళి కృషిని వివరిస్తుంటారు.
24 ఏళ్లుగా ఎంతో మంది మహిళలకు జాతీయ జెండాలను కుట్టడం నేర్పిస్తూ.. వారికి జీవనోపాధి కల్పిస్తున్నారు. వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవం నాటికి 100 పాఠశాలలకు జాతీయ జెండాలతోపాటు పింగళి వెంకయ్య చిత్ర పటాలను అందించడమే ధ్యేయంగా పెట్టుకున్నామని సుభాని అంటున్నారు.