Accused escaped: పోలీసులు నిర్లక్ష్యంతో... ఇటీవల జరిగిన ఓ హత్య కేసులోని నిందితుడు పరారైన సంఘటన ఏలూరు జిల్లాలో చోటు చేసుకుంది. ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లిలో సంచలనం రేకెత్తించిన వైకాపా నాయకుడు గంజి ప్రసాద్ హత్య కేసులో నిందితుడు, రిమాండ్ ఖైదీ రవితేజ జిల్లా కారాగారంలో శిక్షను అనుభవిస్తున్నాడు. గత కొద్ది రోజులుగా నిందితుడు రవితేజకు అనారోగ్యం కారణంగా జిల్లా కేంద్రంలోని ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. నిందితుడి దగ్గర ఇద్దరు సెంట్రీలు ఉండగా అందులో ఒకరు కనిపించడంలేదు. మరొక సెంట్రీని నిందితుడు రవితేజ మచ్చిక చేసుకొని ఇద్దరు మద్యం సేవించారని తెలుస్తోంది. ఈ క్రమంలో ఆస్పత్రి నుంచి నిందితుడు రవితేజ సెంట్రీని ఏమార్చి ఈరోజు తెల్లవారుజామున తప్పించుకున్నాడు.
మరోవైపు ఈ ఘటనతో ఆసుపత్రిలో సెక్యూరిటీ విభాగం వైఫల్యం కూడా బయటపడింది. రాత్రి 10 గంటల తర్వాత ఆ వార్డు వైపు ఎవరిని అనుమతించరు. అలాగే అటు నుంచి ఎవరూ బయటకు రావటానికి వీలు లేకుండా కాపలా కాస్తుంటారు. కానీ అంత మంది ఉన్నా నిందితుడు రవితేజ తప్పించుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఆస్పత్రిలో సీసీ కెమెరాలు సరిగా పనిచేయడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో రవితేజను పట్టుకునేందుకు పోలీసులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు.