పశ్చిమగోదావరి జిల్లాలో శనివారం తెల్లవారుజాము నుంచి పలు ప్రాంతాల్లో ఎడితెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భీమవరం, పాలకొల్లు, ఆచంట, నరసాపురం, తణుకు, తాడేపల్లిగూడెం ప్రాంతాల్లో భారీవర్షం కురిసింది. వర్షంతో పలు గ్రామాలు, పట్టణాల్లోని లోతట్టు ప్రాంతాలు, వీధులు, రహదారులు జలమయమయ్యాయి. జిల్లాలో సగటున 58 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రహదారులపై నీరు చేరడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంట కాలువల్లో భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో వరి మడులు నీట మునిగాయి. పంటలకు నష్టం జరుగుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు
లంకగ్రామాలకు స్తంభించిన రాకపోకలు
గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండడం వల్ల ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. పశ్చిమగోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యామ్ వద్ద వరద ప్రవాహం 27.50 మీటర్లకు చేరుకుంది. గోదావరి వరదతో జిల్లాలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పోలవరం, వేలేరుపాడు మండలాల్లో పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వేలేరుపాడు మండలం రేపాకుగొమ్మ, తాటకూరుగొమ్మ, తిరుమలాపురం, నార్లవరం, కటుకూరు, కోయిదా గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. సుమారు 15 గ్రామాల ప్రజలు నిత్యావసరాలు, వైద్యం కోసం ఇబ్బందులు పడుతున్నారు. పోలవరం మండలంలోని కొండ్రుకోట, తాటగుంట, కొరటూరు పంచాయతీల్లోని 19 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పోలవరం గ్రామం వద్ద వరద ఉద్ధృతి అధికంగా ఉంది. పాత పోలవరం వద్ద నెక్లెస్ బాండ్ బలహీనంగా మారడంతో ఇసుక బస్తాలు వేసి వరదను ఆపే ప్రయత్నం చేస్తున్నారు. వరదల్లో చిక్కుకొన్న గ్రామాలకు నిత్యావసరాలు, కూరగాయాలు అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.