విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ చేయడానికి ఏర్పాటు చేసిన కమిటీలో తాను సభ్యుడిగా ఉన్నట్లు లోకేశ్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డి ఖండించారు. నారా లోకేశ్ ఇష్టానుసారంగా సీఎం, మంత్రి పెద్దిరెడ్డి, సజ్జలతోపాటు తనపై అసత్య ఆరోపణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కడపలో మాట్లాడిన ఆయన.. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు సంబంధించిన ఎలాంటి సమావేశంలో తాను ఎప్పుడు కూడా పాల్గొనలేదన్నారు. పదేపదే అబద్ధాలు ప్రచారం చేస్తూ ప్రజలను లోకేశ్ మభ్య పెడుతున్నారని విమర్శించారు.
విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకమని.. దానిపై సీఎం జగన్ ఇదివరకే ప్రధానికి లేఖ రాసిన విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. ముఖ్యమంత్రి లేఖ రాసిన తర్వాత తెదేపా నేతలు ఒత్తిడి తెస్తే.. రెండు రోజుల కిందట ప్రధానికి చంద్రబాబు లేఖ రాశారని గుర్తు చేశారు. సర్పంచిగా కూడా గెలవలేని నారా లోకేశ్ లాంటి వ్యక్తులకు.. పెద్దలపై ఆరోపణలు చేసే స్థాయి లేదన్నారు. అసత్య ఆరోపణలు చేయడం లోకేశ్ మానుకోవాలని హితవు పలికారు.