రాష్ట్రంలో జరిగిన 2019 సాధారణ ఎన్నికల తరహాలోనే పురపాలిక ఎన్నికల్లోనూ వైకాపా ఓట్ల శాతాన్ని కొల్లగొట్టింది. పోల్ అయిన ఓట్లలో 52.63 శాతాన్ని సొంతం చేసుకుంది. సాధారణ ఎన్నికలలో 49.95 శాతం ఓట్లు సాధిస్తే.. పుర, నగర పాలిక ఎన్నికల్లో ఓట్ల వాటా గణనీయంగా పెరిగింది. కార్పొరేషన్లలోని 532 డివిజన్లల్లో 427 చోట్ల ఫ్యాన్ గాలి వీచింది. మున్సిపాలిటీల్లోని 2,123 వార్డుల్లో ఏకగ్రీవం కాగా.. ఎన్నికలు జరిగిన 1632 వార్డుల్లో 1289 వార్డులను అధికార పార్టీ సొంతం చేసుకుంది. నగరపాలికల్లో 13,19,466 ఓట్లు.. మున్సిపాలిటీల్లో 11 లక్షల 78 వేల 275 ఓట్లు వచ్చాయి. మొత్తంగా 24,97,741 ఓట్లతో..52.63 శాతం మేర ఓట్లను కైవసం చేసుకుంది.
డీలా పడిన తెదేపా..
ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ.. మరింత డీలా పడింది. సార్వత్రిక ఎన్నికల సమయంలో పోలైన ఓట్ల శాతంతో పోలిస్తే..భారీగా ఓట్లను కోల్పోయింది. పుర, నగర పాలికల్లో తనకున్న ఓట్లను దక్కించుకోలేకపోయింది. తెలుగుదేశం పార్టీకి కార్పొరేషన్లలో 8లక్షల 35 వేల ఓట్లు, పురపాలికల్లో 6 లక్షల 22 వేలు ఓట్లు మాత్రమే వచ్చాయి. తెలుగుదేశం పార్టీకి పడిన ఓట్లు మొత్తంగా 14,58,346గా తేలింది. తెలుగుదేశం పార్టీ 30.73 శాతం ఓట్లను దక్కించుకుంది. కార్పొరేషన్లు, పురపాలికలు రెండిటిలోనూ కలిపి 349 వార్డులను మాత్రమే తెదేపా గెలుపొందింది.