ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిల్లీ పర్యటనపై మండలిలో ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు తీవ్రంగా మండిపడ్డారు. ప్రధానికి సమర్పించే వినతిపత్రం ప్రజాపత్రమనీ.. ప్రజలకూ, ప్రతిపక్షాలకూ అందులో ఏముందో తెలియాలన్నారు. నిన్న దిల్లీలో ప్రధాని మోదీకి అందించిన వినతి పత్రం ప్రతిని మీడియాకు ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నించారు. వైకాపా ప్రభుత్వం చేతగానితనం బయటపడుతుందనే భయంతోనే వినతిపత్రాన్ని చూపించలేదని ఎద్దేవా చేశారు.
మీ ఉద్దేశమేంటి?
ఒకవైపు కేసీఆర్ను పొగుడుతూ.. మరోవైపు విభజన చట్టంలో హామీలను నెరవేర్చాలని ప్రధానిని అడగడంలో ఆంతర్యమేంటని యనమల నిలదీశారు. ప్రజలను మభ్యపెట్టేందుకే ఇలాంటి పనులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. 'కేంద్రం డబ్బులు ఇస్తేనే పోలవరం కడతాను.. అప్పటివరకూ అమరావతి నిర్మాణానికి నిధులు అడగను' అనడాన్ని ఏ విధంగా అర్థంచేసుకోవాలన్నారు. అప్పటిదాకా పనులు నిలిచిపోతే రాష్ట్రానికి, ప్రజలకు నష్టం కాదా అని నిలదీశారు.