ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాష్ట్రప్రభుత్వమే ముద్దాయి: యనమల - phone tapping issue

రాష్ట్రప్రభుత్వం చట్టాలను, రూల్ ఆఫ్ లాను అతిక్రమించి ఇష్టారాజ్యంగా వ్యవహారిస్తోందని శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. ప్రధానికి చంద్రబాబు లేఖ రాస్తే... డీజీపీ, హోంమంత్రి భుజాలు తడుముకోవడం ఏంటని ప్రశ్నించారు.

యనమల రామకృష్ణుడు
యనమల రామకృష్ణుడు

By

Published : Aug 19, 2020, 1:16 PM IST

ప్రధానికి చంద్రబాబు లేఖ రాస్తే, డీజీపీ, హోంమంత్రి భుజాలు తడుముకోవడం ఏమిటని శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. ఏపీలో ఫోన్ ట్యాపింగ్ లలో సుప్రీంకోర్టు పేర్కొన్న హేతుబద్ద కారణాలు ఉన్నాయా అని ఆయన నిలదీశారు. ఆర్టికల్ 19,21 ప్రకారం ఇది రాజ్యాంగ ఉల్లంఘన, కేంద్ర చట్టాల ఉల్లంఘనేనని స్పష్టంచేశారు. ఏపీలో ఫోన్ ట్యాపింగ్ పౌర హక్కులను, ప్రాథమిక హక్కులను కాలరాయడమేనన్నారు. ఇది సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించడమేనని... ‘‘రూల్ ఆఫ్ లా’’ ను అతిక్రమించడమేనని యనమల ఆరోపించారు.

ఏ కారణంతో ట్యాపింగ్ చేశారు..

ప్రధాని స్పందన వచ్చేదాకా డీజీపీ, హోం మంత్రి ఎందుకని ఆగలేక పోయారని ప్రశ్నించారు. ప్రతిపక్షాలను లేకుండా చేయడానికి, జ్యూడీషియరీని బ్లాక్ మెయిల్ చేయడానికి బరితెగించారని యనమల మండిపడ్డారు. వాదనలు వినిపించే న్యాయవాదుల ఫోన్ ట్యాపింగ్ కన్నా తీవ్ర నేరం మరొకటి లేదన్నారు. దేశ భద్రతకు భంగం వాటిల్లిందా ఇక్కడ ఏ అంశంలోనైనా, ప్రజా భద్రతకు భంగం కలిగిందా ఇందులో ఎక్కడైనా అని ప్రశ్నించారు. మరి ఏ కారణంతో అడ్వకేట్లు, జడ్జిల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని యనమల నిలదీశారు.

ట్యాపింగ్ పై సర్వీస్ ప్రొవైడర్లకు ఏమైనా లిఖితపూర్వక ఆదేశాలు అందజేశారా అని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్​లో రాష్ట్ర ప్రభుత్వమే ముద్దాయన్న యనమల... ముద్దాయే సాక్ష్యాధారాలు ఇవ్వాలని అడగడం ఎక్కడైనా ఉందా అని మండిపడ్డారు. ట్యాపింగ్ పై కేసు పెట్టాలని డీజీపీ సలహా ఇవ్వడం మరో విడ్డూరమన్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వమే దోషిగా ఉన్నప్పుడు ఎవరిపై కేసు పెట్టాలని నిలదీశారు. డీజీపీ, హోం మంత్రి స్పందన ఫోన్ ట్యాపింగ్ పై అనుమానాలను బలపరుస్తోందన్నారు. ప్రస్తుత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్న లొసుగులను ఆధారంగా చేసుకుని తప్పుడు పనులు చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రం తక్షణమే జోక్యం చేసుకుని ఈ దుశ్చర్యలకు అడ్డుకట్ట వేయాలని యనమల రామకృష్ణుడు డిమాండ్‌ చేశారు.

ఇవీ చదవండి:ఇళ్ల పట్టాలకు ఆ స్థలాలొద్దు.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

ABOUT THE AUTHOR

...view details