ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వేతనాల పెంపు కోరుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ల ధర్నా - వాలంటీర్ల ధర్నా వార్తలు

ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న వేతనాలు సరిపోవడం లేదని.. ప్రజలకు సంక్షేమ పథకాలు అందిచడంలో నిరంతరం పనిచేస్తున్న తమకు జీతాలు పెంచాలంటూ రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్లు ధర్నా కార్యక్రమాలు చేపట్టారు. సమస్యను పరిష్కరించాలని కోరుతూ పలు చోట్ల అధికారులకు సమస్యలపై వినతి పత్రాలు అందించారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే ఉద్యమం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

volunteers dhanra across state for salary hike
వేతనాల పెంపు కోరుతూ.. రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్ల ధర్నా

By

Published : Feb 8, 2021, 5:09 PM IST

కృష్ణా జిల్లాలో..

సమస్యలపై అధికారులకు వినతిపత్రం ఇచ్చేందుకు విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయం వద్దకు పెద్ద సంఖ్యలో వాలంటీర్లు చేరుకున్నారు. లోనికి అనుమతించకపోవడంతో రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. వాలంటీర్​గా నియమించేటప్పుడు 50 ఇళ్లకే పరిమితమని చెప్పిన ప్రభుత్వం... ఇప్పుడు అన్ని పనులు తమతోనే చేయిస్తూ శ్రమ దోపిడీకి పాల్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. డిమాండ్లను పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా విధులను బహిష్కరిస్తామని హెచ్చరించారు. వారిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్​కు తరలించారు.

విశాఖ జిల్లాలో..

తమ డిమాండ్ల నెరవేర్చాలని విశాఖ జిల్లాలో వాలంటీర్లు కలెక్టర్ కార్యాలయం ఎదట నిరసన చేపట్టారు. కనీస వేతనాలు అమలు చేయాలని.. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను తమతోనే చేయిస్తూ.. జీతాలు పెంచకపోవడం దారుణమని విమర్శించారు. డిమాండ్లను నెరవేర్చకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

అన్ని శాఖల విధులను తమకే అప్పగించి పనిభారం పెంచారే తప్ప.. జీతాలు పెంచలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొవిడ్​ వారియర్స్​గా ముందుండి విధులు నిర్వహించిన తమ సేవలను గుర్తించి.. ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించాలని, వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. నర్సీపట్నం డివిజన్ వాలంటీర్లు ఎమ్మెల్యే శంకర్ గణేష్ కు.. ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. వినతి పత్రాన్ని అందజేశారు.

తూర్పుగోదావరి జిల్లాలో..

రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ వార్డు వాలంటీర్లు మున్సిపల్ కార్యాలయం వద్ద నేడు ధర్నా చేశారు. కనీస వేతనం రూ.12 వేలకు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పని భారం తగ్గించాలని నినాదాలు చేశారు. కరోనా సమయంలో ప్రాణం సైతం లెక్కచేయకుండా ప్రజలకు సేవలు అందించిన తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

ప్రకాశం జిల్లాలో..

ప్రకాశం జిల్లా మార్కాపురం ఆర్డీఓ కార్యాలయం వద్ద వార్డు వాలంటీర్లు నిరసన తెలియజేశారు. తమకిచ్చే రూ. 5 వేల వేతనాన్ని 12 వేలకు పెంచాలని వారు డిమాండ్ చేశారు. సుమారు వంద మంది ఆర్డీఓ కార్యాలయానికి చేరుకొని ఆర్డీఓ అధికారి శేషిరెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఎమ్మెల్యే కుందూరు నాగార్జునరెడ్డికి కూడా వినతి పత్రం అందజేశారు. కొత్తగా వచ్చిన రేషన్ వాహనాల డ్రైవర్లకు జీతాలు పెంచడాన్ని వారు గుర్తుచేశారు.

గ్రామ, వార్డు వాలంటీర్లుగా పనిచేస్తున్న తమకు ఇస్తున్న వేతనం చాలడంలేదని, పని ఒత్తిడి పెరిగిపోయిందంటూ ఒంగోలు పట్టణంలో నగర పాలక సంస్థ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. నిత్యం వీధుల్లోనూ, ఉన్నత అధికారుల కార్యాలయాల చుట్టూనూ తిరిగేందుకు ఇచ్చిన జీతం సరిపోవడం లేదని వాపోతున్నారు.

నెల్లూరు జిల్లాలో..

ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు గౌరవ వేతనాన్ని పెంచాలని కోరుతూ నెల్లూరులో వాలంటీర్లు నిరసన చేపట్టారు. నెల్లూరు నగరంలోని కార్పొరేషన్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపి కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్ ప్రసాద్​కు వినతిపత్రం అందజేశారు. వేతనాలు పెంచాలని కోరుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకే ఇద్దరు వాలంటీర్లను విధుల నుంచి తొలగించడం అన్యాయమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తొలగించిన వాలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలని కోరారు.

అనంతపురం జిల్లాలో..

గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ అన్ని పనులూ చక్కబెడుతున్న తమకు గౌరవ వేతనాన్ని పెంచాలని కోరుతూ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని వాలంటీర్లు ఆందోళన చేపట్టారు. కళ్యాణదుర్గం నియోజకవర్గం లోని వాలంటీర్లు పట్టణంలో ర్యాలీ నిర్వహించి మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.

శ్రీకాకుళం జిల్లాలో..

శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీ కార్యాలయం వద్ద వాలంటీర్లు ఆందోళనకు దిగారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, వేతనాలు పెంచాలంటూ కమిషనర్ శివ ప్రసాద్ కు వినతి పత్రం అందించారు. సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంలో వాలంటీర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని సీఐటీయూ జిల్లా కార్యదర్శి దావాల రమణారావు అన్నారు.

ఇదీ చదవండి:

విశాఖ ఉక్కు కర్మాగారం ఎదుట ఆందోళనలు ఉద్ధృతం

ABOUT THE AUTHOR

...view details