ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Amaravati movement: వెయ్యి రోజుల ఉద్యమ బావుటా... ప్రభుత్వ దమననీతిపై రైతుల పిడికిలి

రాజధాని అమరావతికి మరణశాసనం లిఖించేందుకు కంకణం కట్టుకున్న వైకాపా ప్రభుత్వ దమన నీతిపై రైతులు ఉద్యమ బావుటా ఎగరేసి నేటికి వెయ్యి రోజులు. 2019 డిసెంబరు 17న శాసనసభలో ముఖ్యమంత్రి జగన్‌ చేసిన మూడు రాజధానుల ప్రకటనకు నిరసనగా.. మర్నాటి నుంచే రాజధాని గ్రామాల్లో అమరావతి పరిరక్షణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. ప్రభుత్వ అణచివేతల్ని, నిర్బంధాల్ని.. మహిళలని కూడా చూడకుండా పోలీసులు ప్రదర్శించిన కిరాతకాన్ని, చేసిన అవమానాల్ని, అక్రమ కేసుల్ని, అరెస్టుల్ని తట్టుకుని, కరోనా వంటి మహమ్మారికీ, ప్రకృతి విపత్తులకూ వెరవక ఒక్క రోజు కూడా విరామం లేకుండా రాజధాని రైతులు ఉద్యమ ప్రస్థానం కొనసాగిస్తున్నారు. దేశంలో అత్యంత సుదీర్ఘకాలం కొనసాగిన పోరాటంగా అమరావతి పరిరక్షణ ఉద్యమం చరిత్రలో నిలిచిపోతుంది. ప్రతిపక్ష పార్టీల అగ్రనేతలు రాజధానిలో పర్యటించి ఉద్యమానికి, రైతులకు సంఘీభావం ప్రకటించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు, ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో స్థిరపడిన తెలుగువారి నుంచి కూడా రాజధాని రైతులకు మద్దతు లభించింది. రాజధాని ఒక ప్రాంతానిదో, ఒక కులానిదో అన్నట్లుగా ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు, ప్రజలకు వాస్తవాలు చెప్పి, మద్దతు కూడగట్టేందుకు.. గత నవంబరు, డిసెంబరు నెలల్లో అమరావతి నుంచి తిరుపతి వరకు రాజధాని రైతులు చేసిన పాదయాత్రకు దారి పొడవునా ప్రజలు నీరాజనాలు పట్టారు. తర్వాత రాష్ట్ర హైకోర్టు రాజధాని రైతులకు అనుకూలంగా తీర్పు చెప్పింది. కానీ తన మొండి వైఖరి వీడని వైకాపా ప్రభుత్వం కోర్టు ఉత్తర్వుల్ని అమలు చేయకుండా ఇప్పటికీ మూడు రాజధానుల పాటే పాడుతోంది. దాంతో అమరావతి రైతులు ‘బిల్డ్‌ అమరావతి- సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌’ నినాదంతో అమరావతి నుంచి అరసవల్లి వరకు మరో మహాపాదయాత్రకు నేడు శ్రీకారం చుడుతున్నారు. అమరావతి రైతుల ఉద్యమం వెయ్యో రోజుకు చేరిన సందర్భంగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ వి.గోపాలగౌడ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఈటీవీ భారత్​తో తమ అభిప్రాయాల్ని పంచుకున్నారు.

Amaravati movement
వెయ్యి రోజుల ఉద్యమ బావుటా

By

Published : Sep 12, 2022, 8:13 AM IST

ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని, నిర్దేశిత గడువులోగా నిర్మాణాలు పూర్తి చేయాలని, మూడు రాజధానులపై చట్టం చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదని హైకోర్టు విస్పష్టమైన తీర్పిచ్చింది.. దాన్ని ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తున్నందుకు ముఖ్యమంత్రి, సంబంధిత శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వంటి వారందర్నీ జైలుకు పంపాలని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ వి.గోపాలగౌడ అభిప్రాయపడ్డారు. తానే ఆ కేసును విచారిస్తుంటే ముఖ్యమంత్రిని కచ్చితంగా జైలుకు పంపించేవాడినన్నారు. రాజధానిపై హైకోర్టు తీర్పు వెలువడి ఆరు నెలలైనా ఇంకా అమలు చేయకపోవడం, మూడు రాజధానులే తమ విధానమని మంత్రులు మాట్లాడటం న్యాయస్థానంపట్ల ఉద్దేశపూర్వక ధిక్కారం, అవిధేయతగానే భావించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఆదివారం ఆయన ఈటీవీ భారత్​కు ఫోన్‌లో ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలివీ..

వి.గోపాలగౌడ

3రాజధానులపై చట్టం చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదని హైకోర్టు విస్పష్టమైన తీర్పిచ్చింది.. దాన్ని ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తున్నందుకు సీఎం, సంబంధిత శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని జైలుకు పంపాలి. నేనే ఆ కేసును విచారిస్తుంటే ముఖ్యమంత్రిని కచ్చితంగా జైలుకు పంపించేవాడిని. - సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ వి.గోపాలగౌడ

ఎల్వీ సుబ్రహ్మణ్యం

వరికి నచ్చినా, నచ్చకపోయినా ఏపీ రాజధాని అమరావతే. రాజధానిపై హైకోర్టు తీర్పును అమలు చేయడం తప్ప ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం లేదు. సీఎం, మంత్రులు రాజధానిని ఆటవస్తువులా భావించి, మూడు రాజధానుల్ని చేస్తామని అనుకుంటే అనుకోవచ్చుకానీ దానికి చట్టబద్ధత ఉండదు.

-రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం

అవసరమైతే కేంద్ర బలగాల సహకారం:రాష్ట్ర ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తోంది. రాజధానిపై హైకోర్టు తీర్పు అమలు చేయకుండా ఉండటానికి ఏమేం చేయాలో అన్నీ చేస్తోంది. కోర్టు ధిక్కరణ కింద ముఖ్యమంత్రి సహా బాధ్యులందరికీ సమన్లు జారీ చేసి కోర్టుకు పిలిపించాలి. కోర్టు తీర్పును ఉల్లంఘించినందుకు, అబద్ధాలు చెబుతున్నందుకు వారందర్నీ జైలుకి పంపాలి. ముఖ్యమంత్రికి వారెంట్‌ ఇచ్చేందుకు పోలీసులు ముందుకు రాకపోతే ఈ-మెయిల్‌, వాట్సప్‌ల ద్వారా పంపాలి. కోర్టు సీఆర్‌పీఎఫ్‌ సహకారం తీసుకోవాలి. న్యాయమూర్తులు ధైర్యంగా వ్యవహరించాలి.

తప్పుడు ప్రమాణపత్రాలు చెల్లవు:అమరావతి కేసుల్లో హైకోర్టు అన్ని అంశాల్నీ కూలంకషంగా పరిశీలించి నిర్దిష్టమైన తీర్పు చెప్పింది. సీఆర్‌డీఏ చట్టాన్ని రద్దు చేయడం కుదరదని, మూడు రాజధానులపై చట్టం చేసే అధికార పరిధి శాసనసభకు లేదని స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పు చెప్పి ఆరు నెలలైపోయింది. దానిపై సుప్రీంకోర్టు స్టే లేనప్పుడు హైకోర్టు తీర్పే అమల్లో ఉంటుంది. ప్రభుత్వం దాన్ని అమలు చేయకపోవడం ముమ్మాటికీ కోర్టును ఉద్దేశపూర్వకంగా ధిక్కరించడమే. తప్పుడు ప్రమాణపత్రాలతో పొద్దుపుచ్చుతామంటే కుదరదు. ఇలాంటి చర్యలకు ముఖ్యమంత్రి సహా బాధ్యులంతా శిక్షార్హులే.

నిధుల్లేవంటే కుదరదు:రాజధాని నిర్మాణానికి నిధుల్లేవని ప్రభుత్వం తప్పించుకుందామనుకుంటే కుదరదు. మధ్యప్రదేశ్‌లోని రత్లాం మున్సిపాలిటీ కేసులో 1980లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కృష్ణయ్యర్‌ ఇచ్చిన తీర్పు అమరావతికీ వర్తిస్తుంది. రత్లాం మున్సిపాలిటీలో మురుగు కాల్వలు పొంగిపొర్లుతున్నా పాలకమండలి పట్టించుకోవడం లేదని కొందరు కోర్టుకు వెళ్లారు. వసతుల కల్పనకు డబ్బుల్లేవని మున్సిపాలిటీ చెబితే.. అలా అని తప్పించుకోలేరని, అవసరమైతే రాష్ట్ర బడ్జెట్‌ నుంచే నిధులు కేటాయించాలని జస్టిస్‌ కృష్ణయ్యర్‌ స్పష్టం చేశారు. ఆదాయ వనరులు సమకూర్చుకుని, మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత మున్సిపాలిటీది, ప్రభుత్వానిదేనని తేల్చిచెప్పారు. అలాగే అమరావతి నిర్మాణం కూడా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత. సీఆర్డీఏ దగ్గర డబ్బుల్లేవని, రుణం కోసం బ్యాంకుల్ని అడుగుతున్నామని తాత్సారం చేస్తే కుదరదు. ప్రభుత్వం ఇప్పటికే చాలా అప్పులు చేసింది. కావాలంటే ఇంకా చేయండి, రాజధానిని మాత్రం నిర్మించాలని ప్రభుత్వాన్ని కోర్టు స్పష్టంగా ఆదేశించాలి.

ప్రజా ప్రయోజనం ఎక్కడుంది?:ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతిని విపక్ష నేతగా జగన్‌ ఆమోదించారు. ఏ ప్రభుత్వమైనా విస్తృత ప్రజాప్రయోజనాలున్నాయి అనుకున్నప్పుడే గత ప్రభుత్వ విధానాల్లో మార్పులు చేయాలి. మూడు రాజధానుల్లో ప్రజా ప్రయోజనం గానీ రాష్ట్ర ప్రయోజనం గానీ లేవు. పైగా అది ప్రజల, రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధం కూడా.

* ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో మళ్లీ మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెట్టి గవర్నర్‌కు పంపినా, ఆయన ఆమోదించకూడదు. అది కోర్టు తీర్పునకు విరుద్ధమని ప్రభుత్వానికి తిప్పి పంపాలి.

మాస్టర్‌ప్లాన్‌ను మార్చకూడదు:రాజధాని మాస్టర్‌ప్లాన్‌లో ఇష్టానుసారం మార్పులు చేసేందుకు వీలుగా సీఆర్‌డీఏ చట్టాన్ని ప్రభుత్వం సవరించడం కుదరదు. ఒకసారి లేఅవుట్‌ ప్లాన్‌ను ప్లానింగ్‌ అథారిటీ ఆమోదించిన తర్వాత మంత్రివర్గం దానిలో ఇష్టానుసారం మార్పులు చేయడానికి వీల్లేదని వి.ఎస్‌.ముద్దప్ప వర్సెస్‌ బెంగళూరు కార్పొరేషన్‌ కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. లేఅవుట్‌ ప్లాన్‌నే మార్చడానికి వీల్లేనప్పుడు, రాజధాని మాస్టర్‌ప్లాన్‌ను ఎలా మార్చేస్తారు?

హైకోర్టును ఇష్టానుసారం తరలించలేరు:ప్రభుత్వం చెబుతున్నట్లుగా హైకోర్టును అమరావతి నుంచి మార్చడం రాజ్యాంగపరంగా సాధ్యం కాదు. రాష్ట్ర హైకోర్టు తీర్మానం లేకుండా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించకుండా హైకోర్టును మార్చే అధికారం కేంద్ర ప్రభుత్వానికి కూడా లేదు.

కోర్టు తీర్పిచ్చినా 3 రాజధానులనడం వారి అజ్ఞానం: ఎల్వీ సుబ్రహ్మణ్యం

ఎవరికి నచ్చినా, నచ్చకపోయినా ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతేనని, దానిపై భిన్నాభిప్రాయానికి తావులేదని రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. రాజధానిపై హైకోర్టు తీర్పును అమలు చేయడం తప్ప ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం లేదన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు రాజధానిని ఆటవస్తువులా భావించి, మూడు నాలుగు రాజధానుల్ని చేస్తామని అనుకుంటే అనుకోవచ్చుగానీ దానికి చట్టబద్ధత ఉండదన్నారు. ‘చాలా మంది ఇళ్లకు రాజ్‌మహల్‌ అని పేరు పెట్టుకుంటారు. అలా అని వాళ్లు రాజులైపోరు. వైకాపా నాయకులు కూడా వేరే ప్రాంతానికి రాజధాని అని పేరు పెట్టుకున్నా, దానికి చట్టబద్ధత రాదు’ అని ఆయన అభిప్రాయపడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, రాష్ట్ర విభజన తర్వాత ప్రభుత్వంలో వివిధ హోదాల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన ఎల్వీ సుబ్రహ్మణ్యం.. రాజధాని నిర్మాణానికి భూసమీకరణ నుంచి ప్రణాళిక రూపకల్పన వరకు ప్రతి అంశాన్ని దగ్గర నుంచి పరిశీలించారు. ఉద్యమం వెయ్యో రోజుకు చేరుకున్న సందర్భంగా ఆయన ‘ఈనాడు’ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాల్ని స్పష్టంగా తెలియజేశారు. ముఖ్యాంశాలివీ..

సీఎం, మంత్రుల తీరు హాస్యాస్పదం:కోర్టు ఏం చెప్పిందో మనకు అర్థం కాకపోయినా పర్వాలేదు. ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు మాకు అర్థం కాలేదని చెప్పడానికి వీల్లేదు. మేం అమాయకులం, చట్టాన్ని మాకు ఇష్టం వచ్చినట్టుగానే అర్థం చేసుకుంటామంటే కుదరదు. గత ప్రభుత్వం రాజధాని రైతులతో అనేక ఒప్పందాలు చేసుకుంది. ప్రత్యేకంగా చట్టం చేసింది. వాటి సారాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఈ ప్రభుత్వం ఇప్పటికీ ప్రయత్నం చేయలేదన్నది నా భావన. ముందు ప్రభుత్వ పెద్దలు వాటిని అర్థం చేసుకోవాలి. మాకు అర్థమైంది ఇదీ, దాని ప్రకారం మూడు రాజధానుల ఏర్పాటుకు మాకున్న వెసులుబాటు ఇదీ అని చెబితే కొంత సబబుగా ఉంటుంది. అంతే తప్ప చంద్రబాబు ఏం చేశారో నాకనవసరం, అది నాకు నచ్చలేదు, నా ఇష్టమొచ్చింది చేస్తానని ముఖ్యమంత్రి, మంత్రులు మాట్లాడటం హాస్యాస్పదం.

ప్రభుత్వమంటే గుడ్డిగా వ్యవహరించకూడదు:ప్రభుత్వ వాదనలన్నీ విన్న తర్వాతే హైకోర్టు రాజధానిపై తీర్పు చెప్పింది. దానిపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లలేదు. కాబట్టి ఈ రోజుకి హైకోర్టు తీర్పే ఫైనల్‌. ఆ తర్వాత కూడా మూడు రాజధానులపై ముందుకెళ్లేందుకు వెసులుబాటు ఉందని వారు అనుకుంటే అదే విషయాన్ని ప్రజలకు చెప్పాలి. అంతేతప్ప మా ప్రభుత్వం చిన్నప్పటి నుంచీ మూడు రాజధానుల గురించి మాట్లాడుతోంది కాబట్టి, దానికే కట్టుబడి ఉన్నామని చెప్పడం అజ్ఞానం అవుతుంది. ప్రభుత్వం గుడ్డిగా ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. రాజధానిపై వాళ్ల ఆలోచనలేంటో, ఎలా అమలు చేస్తారో ప్రజలకు ప్రతి మంత్రి వివరంగా చెప్పాలి. మంత్రిని కాబట్టి నేను చెప్పిందే చెల్లుబాటవుతుందనడం హేయంగా ఉంది.

రాజధాని లేని మనల్ని చూసి అందరూ నవ్వుకుంటున్నారు:రాష్ట్ర విభజన జరిగాక ఒక ముఖ్యమంత్రి పదవీకాలం అయిపోయింది. రెండో సీఎం పదవీకాలం కూడా త్వరలో ముగిసిపోనుంది. అయినా రాజధానికి అతీగతీ లేకపోవడం చూసి.. ఆంధ్రజాతి ఇంతేనని అందరూ మనల్ని చూసి నవ్వుకుంటున్నారు.

రహస్య పాలన ఏ పాకిస్థాన్‌లోనో చెల్లుతుంది:ప్రజాస్వామ్య ప్రభుత్వం ప్రతి నిర్ణయాన్నీ ప్రజలకు తెలియజేయాలి. మేం ఏమీ చెప్పం, మాలో మేం రహస్యంగా మాట్లాడుకుంటాం, మంత్రివర్గ సమావేశంలోనూ చెవుల్లో గుసగుసలాడుకుంటాం.. అని చెప్పడం భారత్‌లో కుదరదు. ఏ పాకిస్థాన్‌లోనో సాధ్యమవుతుంది.

ప్రధాన కార్యదర్శి దోషిగా నిలబడాల్సి వస్తుంది:ప్రభుత్వం మళ్లీ మూడు రాజధానుల బిల్లు పెడితే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రవర్తనను కోర్టులు తప్పుబట్టే అవకాశం ఉంది. న్యాయశాఖ కార్యదర్శినీ ప్రశ్నించే ప్రమాదం ఉంది. బిల్లు ఎలా ప్రవేశపెడతారని రేపు గవర్నర్‌ కూడా ప్రశ్నించే పరిస్థితులు వస్తాయి.

రైతులపట్ల ప్రభుత్వ తీరు సిగ్గుచేటు:మనకు తిండిగింజలు సమకూర్చే రైతు రుణం మనం తీర్చుకోగలమా? ఒక్క మెతుకు కింద పడేసినా బాధపడతాం కదా? అలాంటి రైతులు తమ భూములు కోల్పోయి.. వెయ్యి రోజులపాటు ఉద్యమం చేయాలా? వారికి జరిగింది చాలా చాలా అన్యాయం. రైతులతో కనీసం చర్చించే ప్రయత్నం చేయకుండా, ప్రభుత్వం వారిని శత్రువుల్లా చూడటమేంటి? ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు రైతులతో అలా ప్రవర్తించడం సిగ్గుచేటు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details