నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై(MP RAGHURAMA) అనర్హత పిటిషన్ వ్యవహారంపై లోకసభ స్పీకర్ ఓం బిర్లా పక్షపాతధోరణితో వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోందని వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి(VIJAYA SAI REDDY) ఆరోపించారు. అనర్హత పిటిషన్ ఇచ్చి ఏడాది పూర్తైనా.. ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. అనర్హత పిటిషన్‌లో ఎక్కడ సంతకాలు చేయలేదో వాటికి సంబంధించిన అదనపు వివరాలను జోడించినట్లు తెలిపారు. చట్ట వ్యతిరేకంగా తీవ్ర పదజాలం వాడుతూ ప్రభుత్వాన్ని, పార్టీని విమర్శిస్తున్న కథనాల వివరాలను అందించినట్లు పేర్కొన్నారు. రఘురామపై అనర్హత వేటు వేయాలని మరోసారి కోరినట్లు విజయసాయి రెడ్డి వెల్లడించారు.
ఇందుకు స్పీకర్ స్పందిస్తూ.. నోటీసు ఇచ్చిన తర్వాత 15 రోజుల్లో సభాహక్కుల సంఘానికి సిఫారసు చేయనున్నట్లు బదులిచ్చినట్లు చెప్పారు. కానీ.. గతంలో అనర్హత పిటిషన్లు వచ్చినప్పుడు.. రబిరైజర్, సోమనాథ్ చటర్జి వంటి వారు సభా హక్కుల కమిటీకి సిఫార్సు చేయలేదని విజయసాయి గుర్తుచేశారు. శరద్ యాదవ్ అంశంలో రాజ్యసభ ఛైర్మన్ కేవలం వారం రోజుల్లోనే చర్యలు తీసుకున్న ఉదంతాలను ప్రస్తావిస్తూ రఘురామపై చర్యలు వేగవంతం చేయాలని కోరారు.
సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం 6 నెలలలోపే అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవలసి ఉందన్న విజయసాయిరెడ్డి.. ఏడాది కాలంగా స్పీకర్ స్పందించకపోవడం పక్షపాత ధోరణితో కూడుకున్నట్లుగా కనిపిస్తోందన్నారు. ఇకనైనా స్పీకర్ వైఖరి మార్చుకోకపోతే వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తానన్నారు. ఈ విషయంపై స్పీకర్ త్వరితగతిన నిర్ణయం తీసుకోకపోతే.. తీవ్రంగా పరిగణించి.. రానున్న పార్లమెంటు సమానేశాల్లో పార్టీ ఎంపీలంతా కలిసి ఆందోళనకు దిగనున్నట్లు వెల్లడించారు.