ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Vamshadhara tribunal: వంశధార రెండు రాష్ట్రాలకు చెరి సగం! - వంశధార ప్రాజెక్టు వార్తలు

నదీ జలాలు, నేరడి ప్రాజెక్టుకు భూసేకరణపై వంశధార ట్రైబ్యునల్‌ ఇవాళ విచారణ జరిపింది. ఈ మేరకు రెండు మధ్యంతర పిటిషన్లపై ఉత్తర్వులు ఇచ్చింది. ఏపీ కోరినట్లు నేరడి ప్రాజెక్టు రిటైనింగ్‌ వాల్‌కు అవసరమైన 106 ఎకరాల భూమిని ఒడిశా ప్రభుత్వం సేకరించాలని పేర్కొంది. తగ్గినా, పెరిగినా వంశధార జలాలను 2 రాష్ట్రాలు చెరి సగం వాడుకోవాల్సిందేనని మరోమారు స్పష్టం చేసింది.

Vamshadhara tribunal
Vamshadhara tribunal

By

Published : Jun 21, 2021, 10:15 PM IST

వంశధార నదిపై నేరడి ప్రాజక్టు రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ బాధ్యత ఒడిశా ప్రభుత్వానిదేనని వంశధార ట్రైబ్యునల్‌ స్పష్టం చేసింది. 106 ఎకరాల భూసేకరణ జరిపి.. ఆ భూమిని అవకాశం ఉన్నంత త్వరగా... ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి అప్పగించాలని ఆదేశాల్లో పేర్కొంది. వంశధార నదీ జలాలు, నేరడి ప్రాజక్టు రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణానికి భూసేకరణ వ్యవహారాలపై దాఖలైన రెండు మధ్యంతర పిటిషన్ల-ఐఎలపై వంశధార ట్రైబ్యునల్‌ ఉత్తర్వులు వెలువరించింది.

రెండు పిటిషన్లపై విచారణ

నేరడి ప్రాజక్టు రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణానికి అవసరమైన భూసేకరణపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. ఒడిశా పిటిషన్ దాఖలు చేసింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిపాదించిన విధంగా 106 ఎకరాలు సరిపోదని, ఇంకా ఎక్కువ అవసరం అవుతుందనే అంచనా ఉందని, ఇప్పటి వరకు ప్రాజక్టు సంబంధించిన సమగ్రమైన ప్లాన్‌ కూడా ఇవ్వలేదని పిటిషన్‌లో పేర్కొంది. నేరడి ప్రాజక్టు నిర్మాణాల కొనసాగింపు, ఆపరేషన్‌, మెయింట్​నెన్స్‌, నీటి పంపకాల విషయంలో సూపర్‌వైజరి కమిటీ సభ్యుల మధ్య విభేదాలు వస్తే.. పరిష్కారానికి ఒక అప్పీల్‌ అథారిటీ ఏర్పాటు చేయాలని, నీటి పంపకాల్లో స్పష్టత కోరుతూ.. కేంద్ర జలశక్తి శాఖ మరో పిటిషన్‌ దాఖలు చేసింది. రెండు పిటిషన్లపై ట్రైబ్యునల్‌ విచారణ జరిపి తుది ఉత్తర్వులు ఇచ్చింది.

విభేదాల సమీక్షాధికారం కేంద్ర జలశక్తిశాఖ కార్యదర్శికి ఉంది..

ఆంధ్రప్రదేశ్‌ కోరిన విధంగా.. 106 ఎకరాల భూమిని సేకరించి, అప్పగించాల్సిన బాధ్యత ఒడిశా ప్రభుత్వానిదేనని స్పష్టం చేసిన ట్రైబ్యునల్‌.. అవకాశం ఉన్నంత త్వరగా.. రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణానికి భూమి సేకరించి ఇవ్వాలని ఉత్తర్వులు విడుదల చేసింది. ప్రాజక్టు మెయింటినెన్స్‌, నీటి పంపకాలు సవ్యంగా జరిపేందుకు గతంలో ట్రైబ్యునల్‌ ఒక సూపర్‌వైజరి కమిటి ఏర్పాటు చేసిందని, ఆ కమిటీలో రెండు రాష్ట్రాల నీటిపారుదల అధికారులతోపాటు.. కేంద్ర జలశక్తి శాఖ అధికారులు, కేంద్ర జల సంఘం అధికారులు కూడా సభ్యులని ట్రైబ్యునల్‌ పేర్కొంది. సూపర్​వైజరి కమిటీలో విభేదాలు తలెత్తితే.. వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర అధికారులు, జలసంఘం అధికారులపై ఉంటుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి సమీక్షించే అధికారం ఉంటుంది కాబట్టి.. ప్రత్యేకంగా అప్పీల్‌ అథారిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని ట్రైబ్యునల్‌ తీర్పు ఇచ్చింది.

చెరో సగం వాడుకోవాలి..

వంశధార నదీ జలాలను ఇరు రాష్ట్రాలు చెరి సగం వాడుకోవాలని గతంలోనే ట్రైబ్యునల్‌ ఆదేశించింది.. ఇప్పటివరకు రెండు రాష్ట్రాల మధ్య 115 టిఎంసీల అంచనాతో ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందం జరిగిందని పేర్కొన్న ట్రైబ్యునల్‌.. 115 టిఎంసీలకు తక్కువ వచ్చినా, ఎక్కువ వచ్చినా.. చెరిసగం వాడుకోవాల్సిందేనని ఆదేశాలు ఇచ్చింది. 2017లో ఇచ్చిన ఉత్తర్వులపై అప్పీలుకు రావడంతో మరోసారి విచారణ జరిపిన ట్రైబ్యునల్‌ ఇప్పుడు ఇచ్చిన తీర్పే తుది తీర్పు అని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి:

King Cobra: 14 అడుగుల కింగ్ కోబ్రా హల్ చల్

ABOUT THE AUTHOR

...view details