Amit shah Hyderabad Tour: బడుగు బలహీనవర్గాల అభివృద్ది కోసం కేంద్రం అనేక కార్యక్రమాలు చేపడుతోందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. అందరికి కరెంట్, ఉచిత సిలిండర్లు, టాయిలెట్ల నిర్మాణాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు అమిత్ షా వెల్లడించారు. చేతనైన మేర సహాయం చేయాలని భాజపా శ్రేణులకు మోదీ చెప్తుంటారని అమిత్‌షా పేర్కొన్నారు. ప్రధాని మోదీ జన్మదినం పురస్కరించుకుని సికింద్రాబాద్లో దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, పరికరాలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి అమిత్‌షా ముఖ్యఅతిథిగా హాజరైనారు. సిక్ విలేజ్‌లోని క్లాసిక్ గార్డెన్‌లో దివ్యాంగులకు అవసరమైన ట్రై సైకిళ్లు, ఆట పరికరాలను ఆయన అందజేశారు. వాజ్‌పేయి ఫౌండేషన్, భారత్ సేవా సహకార్ ఆధ్వర్యంలో పరికరాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ప్రతి ఒక్కరు సేవా కార్యక్రమాలు చేయాలని మోదీ చెప్తుంటారని అమిత్ షా పేర్కొన్నారు. ముఖ్యంగా దివ్యాంగులకు సాయం చేయడమంటే మోదీకి చాలా ఇష్టం అని తెలిపారు. డబ్బు రూపంలో కంటే అవసరమైన వస్తురూపంలో సాయం చేయటం మంచిదన్నారు. అంధులు గుర్తించేలా మోదీ కొత్త నోట్లు తీసుకువచ్చారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, బండి సంజయ్, ఇతర భాజపా నేతలు పాల్గొన్నారు.