శ్రీవారిపై భక్తివిశ్వాసాలతో తిరుమలకు వచ్చే అన్యమతస్థులు... స్వామివారిని దర్శించుకునేందుకు ఎటువంటి డిక్లరేషన్ అవసరం లేదని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. తితిదే ఆధ్వర్యంలో ఎటువంటి అన్యమత ప్రచారం జరగడం లేదని స్పష్టం చేశారు. శుక్రవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలపై జరిగిన సమావేశంలో సుబ్బారెడ్డి మాట్లాడారు.
గత ప్రభుత్వ కాలంలో తిరుమలలో పాతుకుపోయిన దళారీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించినట్లు తెలిపారు. శారదా పీఠానికి నిబంధనల మేరకే నిధులు అందించామని.. ప్రజల యోగక్షేమం కోసం వేదసదస్సు, యాగాల నిమిత్తం ఆ నిధులను కేటాయించినట్లు వివరించారు. ఇందులో సీఎం జగన్ సైతం పాల్గొన్నారన్నారు. తితిదేపై ప్రతిపక్ష నేత చంద్రబాబు చేసిన ఆరోపణలన్నీ దుష్ప్రచారమేనని అన్నారు. తిరుమలలో 2014 నుంచి 2019 వరకు జరిగిన అవకతవకలపై ఆడిటింగ్ జరిపించాలని భాజపా ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి కోర్టులో పిల్ వేసిన అంశాన్ని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. స్పందించిన సీఎం ప్రస్తుత సంవత్సరానికి కూడా ఆడిటింగ్ చేయించాలని చెప్పారన్నారు.
ఈ కారణంగానే... తితిదే అకౌంట్స్‌ను కాగ్ ఆడిటింగ్ కోసం ప్రతిపాదించామని తెలిపారు. కరోనా నేపథ్యంలో తితిదే ఆదాయం తగ్గిందని.. అదే సమయంలో తితిదే కార్పస్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీరేటు కూడా తగ్గిపోయిందని పేర్కొన్నారు. దాంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీచేసే బాండ్లలో పెట్టుబడి పెట్టడంపై ఆలోచించాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ మాట్లాడుతూ.. ఈ సంవత్సరం డిసెంబరు వరకు రూ.5వేల కోట్ల డిపాజిట్లు మెచ్యూరిటీ అవుతాయని, వాటిని ఎందులో పెట్టుబడిగా పెట్టాలనే అంశంలో భాగంగానే ప్రస్తుతం ప్రభుత్వ బాండ్లను పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి, తిరుపతి జేెఈవో బసంత్‌కుమార్, ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు పాల్గొన్నారు.
23న సీఎం పట్టువస్త్రాల సమర్పణ