Tspsc group1: తెలంగాణ తొలి గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణలో టీఎస్‌పీఎస్సీ మార్పులు చేసింది. పరీక్ష సమయానికి 15 నిమిషాల ముందుగానే (ఉదయం 10.15గంటలకు) పరీక్ష కేంద్రం గేటు మూసివేసి, అభ్యర్థుల్ని అనుమతించబోమని వెల్లడించింది. వీలైనన్ని బహుళ సిరీస్‌లతో ప్రశ్నపత్రాలను కమిషన్ సిద్ధం చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 1,041 పరీక్ష కేంద్రాల్లో ఈనెల 16న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనుంది. మొత్తం 503 పోస్టులకు రాష్ట్రంలో 3,80,202 మంది హాజరు కానున్న ఈ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను ఆదివారం నుంచి కమిషన్ అందుబాటులోకి తెచ్చింది.
వెబ్‌సైట్ నుంచి వాటిని డౌన్‌లోడ్ చేసుకునేందుకు వీలుగా ప్రత్యేక లింకు ఏర్పాటుచేసింది. పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులు చెప్పులతోనే రావాలని, బూట్లు ధరించరాదని స్పష్టీకరించింది. గోరింటాకు, సిరా, టాటూస్ తదితరాలతో చేతులు, కాళ్లకు అలంకరణలు చేసుకుని రావద్దని తెలిపింది. తప్పుడు ధ్రువీకరణలతో హాజరైనా, ఒకరి పేరిట మరొకరు వచ్చినట్లు తెలిసినా క్రిమినల్ కేసులు పెడతామని, కమిషన్ పరీక్షల నుంచి డీబార్ చేస్తామని హెచ్చరించింది. ఇక.. ఓఎంఆర్ పత్రంలో వైట్నర్, చాక్‌పౌడర్, బ్లేడ్, రబ్బరు వాడితే ఆ పత్రాన్ని అనర్హమైనదిగా గుర్తించి, మూల్యాంకనానికి పరిగణించరు. పరీక్ష సమయం ముగిసే వరకు అభ్యర్థులు బయటకు వెళ్లడానికి అనుమతించరు. అభ్యర్థుల ఓఎంఆర్ షీట్ల డిజిటల్ ఇమేజ్ స్కానింగ్ అనంతరం డిజిటల్ ఓఎంఆర్ కాపీలను కమిషన్ తన వెబ్‌సైట్‌లో ఉంచనుంది.
ప్రిలిమినరీ అభ్యర్థుల నుంచి బయోమెట్రిక్ తీసుకున్నాకే పరీక్ష రాసేందుకు అనుమతిస్తామని టీఎస్‌పీఎస్సీ తెలిపింది. ప్రిలిమినరీ రాసేటపుడు తీసుకున్న బయోమెట్రిక్, మెయిన్స్‌కి వచ్చినపుడు తీసుకునే దానితో సరిపోలితేనే ప్రధాన పరీక్ష రాసేందుకు అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది. పరీక్ష కేంద్రాలు, చిరునామాపై తలెత్తే సందేహాల నివృత్తికి జిల్లా కలెక్టరేట్లలో గ్రూప్-1 హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ బి.జనార్దన్‌రెడ్డి తెలిపారు. హాల్‌టికెట్లు వెబ్‌సైట్‌లో పొందుపరిచిన గంట సమయంలోనే 50వేల మందికిపైగా డౌన్‌లోడ్ చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆదివారం రాత్రి వరకు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్న వారి సంఖ్య 1,32,406గా ఉన్నట్లు చెప్పారు. అభ్యర్థులు సకాలంలో వాటిని డౌన్‌లోడ్ చేసుకుని పరీక్షకు హాజరుకావాలని కోరారు. ఓఎంఆర్‌పై అభ్యర్థి, ఇన్విజిలేటర్ ఇద్దరూ సంతకాలు చేయాలని, ఏ ఒక్కరి చేవ్రాలు లేకున్నా మూల్యాంకనానికి జవాబు పత్రాల్ని పరిశీలించబోమన్నారు. ఇరువురి సంతకాలు ఉండేలా అభ్యర్థి చూసుకోవాలని, తప్పుచేసే ఇన్విజిలేటర్లపై చర్యలు తప్పవని కమిషన్ ఛైర్మన్ హెచ్చరించారు.