తెలంగాణలోని మూడు చింతలపల్లి అభివృద్ధిపై తాను చెప్పిన మాటలు తప్పయితే ముక్కు నేలకు రాసి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Tpcc Chief Revanth Reddy) అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, నాయకుడిగా నాలుగుకోట్ల మంది తెలంగాణ ప్రజల తరఫున కొట్లాడటానికి కారణం మల్కాజిగిరి ప్రజలని ఆయన స్పష్టం చేశారు. మేడ్చల్ జిల్లా సీఎం కేసీఆర్ దత్తత గ్రామం మూడుచింతలపల్లి(Muduchinthalapalli)లో కాంగ్రెస్ చేపట్టిన దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఏడున్నర ఏళ్లుగా కేసీఆర్ చేపట్టిన పనుల వల్ల పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆలోచించడానికే రెండు రోజుల దీక్ష చేపట్టినట్లు వివరించారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ లక్ష్మాపూర్, కేశవాపూర్, మూడుచింతలపల్లి గ్రామాలను దత్తత తీసుకుని నాలుగేళ్లు గడుస్తున్నా అభివృద్ధి ఏం జరగలేదని రేవంత్ ఆరోపించారు. ఆయన దత్తత తీసుకున్న తర్వాతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచిందని పేర్కొన్నారు. 2015లో సీఎం దత్తత తీసుకున్న చిన్నముల్కనూర్ గ్రామంలో ఇంకా 150 కుటుంబాల ప్రజలు ఇంకా రోడ్ల మీద బతుకుతున్నారని రేవంత్ ప్రస్తావించారు. లక్ష్మాపూర్ గ్రామంలో ప్రారంభించిన ధరణి వెబ్సైట్లోనే లక్ష్మపూర్ లేదన్నారు. తెరాస నాయకులు ఇక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని... మూడుచింతలపల్లి అభివృద్ధిపై తాను చర్చకు సిద్ధమని రేవంత్ సవాల్ విసిరారు.