శాసనసభలో తెదేపా అధినేత చంద్రబాబు సతీమణిపై అసభ్యకరంగా మాట్లాడటం సరైందికాదని తెలుగుదేశం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు(telangana tdp president) బక్కని నర్సింహులు అన్నారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌లో నర్సింహులు శనివారం మీడియాతో మాట్లాడారు. ఆదివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మౌన ప్రదర్శనలు, దీక్షలు చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అంతకుముందు పార్టీ రాష్ట్ర ముఖ్య నేతలతో సమావేశమై చర్చించారు. ఏపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ మాట్లాడుతూ జగన్ పాలనలో ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోయి అప్రతిష్ఠపాలైందన్నారు. వైకాపాను ప్రజలు తరిమికొట్టడం ఖాయమన్నారు.
చంద్రబాబు కన్నీటిపర్యంతం
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో జరిగిన పరిణామాలపై తెదేపా అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు తీవ్ర భావోద్వేగానికి(Chandrababu crying) గురయ్యారు. వైకాపా సభ్యులు.. ఏకంగా ఆయన సతీమణి భువనేశ్వరిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని కన్నీటి పర్యంతమయ్యారు.మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెక్కి వెక్కి ఏడ్చారు. తన భార్య వ్యక్తిత్వాన్ని కించపరిచేలా తీవ్రంగా అవమానించారంటూ... మాటలు తడబడుతూ ఉద్వేగాన్ని ఆపుకోలేకపోయారు. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా చలించని చంద్రబాబు.... కష్టనష్టాల్లో తోడుగా నిలిచిన సతీమణిని అనరాని మాటలు అన్నారంటూ తీవ్రంగా ఆవేదన చెందారు. ఇలాంటి అవమానం తట్టుకోలేనంటూ వెక్కివెక్కి ఏడ్చారు. ఉబికివస్తున్న కన్నీటిని చేతి రుమాలుతో తుడుచుకునే ప్రయత్నం చేసినా.... అవమానభారంతో ఆయనకు ఉద్వేగం ఆగలేదు. అధినేత రోదించడాన్ని చూసి తెలుగుదేశం నేతలు నిశ్చేష్టులయ్యారు. ఎలాంటి పరిస్థితులనైనా మొక్కవోని ధైర్యంతో దీటుగా ఎదుర్కొనే చంద్రబాబు.... ఒక్కసారిగా ఏడవడంతో వాళ్లూ కంటతడి పెట్టారు.
నందమూరి కుటుంబసభ్యుల స్పందన
తెదేపా అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైకాపా నేతల వ్యాఖ్యలపై నందమూరి కుటుంబసభ్యులు స్పందించారు.తన సోదరి భువనేశ్వరిపై వ్యక్తిగత విమర్శలు చేయడం బాధాకరమన్న బాలకృష్ణ(Balakrishna chandrababu naidu).. అసెంబ్లీలో ఉన్నామో, పశువుల కొంపలో ఉన్నామో అర్థం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో ధైర్యంగా ఉండే చంద్రబాబు కంటతడి పెట్టుకోవటం తాము ఎప్పుడూ చూడలేదని నందమూరి బాలకృష్ణ అన్నారు. ప్రజాసమస్యలపై పోరాడాల్సిన అసెంబ్లీలో అభివృద్ధిపై బదులు.. వ్యక్తిగత అజెండా తీసుకువచ్చారని మండిపడ్డారు. వైకాపా నుంచి మహిళా శాసనసభ్యులు సభలో ఉన్నారన్న బాలకృష్ణ.. అందరి కుటుంబాల్లో ఆడవాళ్లు ఉన్నారని.. హేళన చేయొద్దని హితవు పలికారు. ఈ పరిణామాలతో కొత్త నీచ సంస్కృతికి తెరలేపారని ఆక్షేపించారు. ఏపీ ఏ పరిస్థితుల్లో ఉందో ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.