ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వైఎస్ఆర్ పెళ్లి కానుక.. ఉత్తర్వులు జారీ అయినా అమలుకు నోచని పథకం! - వైఎస్ఆర్ పెళ్లి కానుక వార్తలు

వైఎస్ఆర్ పెళ్లి కానుక. బీసీలకైతే రూ.50 వేలు..ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ యువతుల వివాహానికి లక్ష,.. కులాంతర వివాహాలకైతే ఏకంగా రూ. లక్షా 20 వేలు.! ఇవన్నీ ఇచ్చేశారనుకుంటున్నారా.! ఇస్తామని ప్రకటించారంతే.! గత ప్రభుత్వం పెళ్లిపందిట్లోనే కానుక అందిస్తే అందిస్తే.. ఈ ప్రభుత్వంలో పెళ్లై పిల్లలు పిల్లలు పుట్టిన తర్వాత కూడా అందించలేకపోయింది .

వైఎస్ఆర్ పెళ్లి కానుక
వైఎస్ఆర్ పెళ్లి కానుక

By

Published : May 11, 2022, 5:58 AM IST

ఎన్నికల ముందు ప్రతిపక్షనేతగా, అధికారం చేపట్టాక ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్‌రెడ్డి... పెళ్లి కానుక పథకం అమలుపై ఎన్నో హామీలు ఇచ్చారు. పేదింటి బిడ్డల వివాహానికిచ్చే ఆర్థిక సాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రకటించారు. ప్రమాణ స్వీకారం తర్వాత ఏడాదిపాటు దరఖాస్తులనూ తీసుకున్నారు. 2020 ఏప్రిల్‌ 2 (శ్రీరామ నవమి) నుంచి పెంచిన సాయంతో సహా పథకాన్ని అమలు చేస్తామని ఉత్తర్వులూ ఇచ్చారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరాక తీసుకున్న దరఖాస్తులకు ఒక్క రూపాయి చెల్లించలేదు. అలాగని 2020 ఏప్రిల్‌ నుంచి పథకాన్ని అమలు చేశారంటే అదీ లేదు. అసలు పథకం ఉందా? లేదా? అనేదీ స్పష్టత లేదు. 2019 సెప్టెంబరులో నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పెళ్లికానుక పథకానికి ఆమోదం లభించింది. 2020 నుంచి అమలులోకి వస్తుందని అప్పటి రవాణా శాఖ మంత్రి పేర్నినాని ప్రకటించారు. ఇందుకు ఏకంగా రూ.750 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. రాముడి కల్యాణం జరిగే శ్రీరామనవమి నుంచి సాయం అందిస్తామన్నారు. కానీ... ఇప్పటివరకు అతీగతీ లేదు.

గతంలో ఠంచనుగా సాయం
గత ప్రభుత్వం 2018 ఏప్రిల్‌ నుంచి పెళ్లికానుకను అమల్లోకి తీసుకొచ్చింది. ఆ ఏడాది వివాహాలు చేసుకున్న 83 వేల కొత్త జంటలకు ఆర్థిక సాయాన్ని అందించి భరోసా కల్పించింది. పెళ్లి జరిగే సమయంలోనే సాయంలో 20%, పెళ్లి అయిన నెల రోజుల్లో మిగతా 80% అందించింది. ఆ ప్రాతిపదికగానే కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2019-20లో 1.28 లక్షల వివాహాలు జరిగే అవకాశముందని అంచనా వేసిన అధికారులు... వీరికి పెళ్లికానుక సాయాన్ని అందించేందుకు రూ.716 కోట్లు అవసరమని అంచనా వేసి బడ్జెట్‌లో ప్రతిపాదించారు. కానీ అమలు చేయలేదు. ఆ తర్వాతి బడ్జెట్లలో పథకం ఊసే లేదు. సంక్షేమ క్యాలెండర్లు ఏటికేడు ప్రకటిస్తున్నా పెళ్లికానుక అమలు తేదీలు మాత్రం అందులో ఉండటం లేదు.

కరోనా సాకు చూపి...
మొదటి ఏడాది బడ్జెట్‌ కేటాయింపులతో సెర్ప్‌ అధికారులు 60 వేల మంది నుంచి దరఖాస్తులు స్వీకరించారు. లబ్ధిదారులకు రూ.316 కోట్లు చెల్లించాల్సి ఉంది. కొత్త సాయం ప్రకారం లెక్కిస్తే రెట్టింపు ఉంటుంది. అయితే... కరోనా నేపథ్యంలో 2020 మార్చి నుంచి దరఖాస్తుల స్వీకరణను ఆపేశారు. తర్వాత పునరుద్ధరించలేదు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారికి సాయాన్ని అందిస్తారా? లేదా? అనేది స్పష్టతనివ్వడం లేదు.

కళ్యాణమిత్రలకు మొండిచేయి
గత ప్రభుత్వ హయాంలో ఈ పథకం అమలుకు డ్వాక్రా సంఘాల్లోని సభ్యులను కల్యాణమిత్రలుగా నియమించారు. పెళ్లిళ్ల వివరాల నమోదు ఆధారంగా వారికి నగదు ప్రోత్సాహకాన్ని అందించేవారు. వీరు నెలనెలా కొంతమొత్తం సంపాదిస్తూ తమ కుటుంబాలకు చేదోడుగా నిలిచేవారు. వైకాపా అధికారంలోకి వచ్చాకా... కల్యాణమిత్రలు వారి పరిధిలో జరిగిన వివాహాల వివరాలను ప్రభుత్వానికి పంపారు. ఆ మేరకు దాదాపు 1,800 మంది కల్యాణమిత్రలకు రూ.4 కోట్ల మేర ప్రోత్సాహకం పెండింగ్‌లో ఉంది.

* గత ప్రభుత్వం ఇచ్చింది: ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ యువతుల వివాహానికి రూ.50 వేలు, బీసీలకు రూ.35 వేలు

* వైకాపా ప్రభుత్వం పెంచుతామంది: ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రూ.లక్ష, బీసీలకు రూ.50 వేలు

* కులాంతర వివాహాలకు ప్రోత్సాహం: దంపతులకు రూ.1.20 లక్షలు

బీసీ యువతుల వివాహానికి ఇస్తున్న రూ.35 వేల ఆర్థిక సాయాన్ని రూ.50 వేలకు పెంచుతాం. ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, క్రిస్టియన్‌ మైనార్టీ యువతుల వివాహానికి రూ.లక్ష సాయాన్ని అందిస్తాం.- వైకాపా ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటన

చంద్రబాబు పెట్టిన పెళ్లికానుక పథకం నవంబరు 2018 నుంచే తెరమరుగైంది. గతంలో నేను చెప్పిన మాట నాకు గుర్తుంది. నాకు 2020 మార్చి వరకు సమయం ఇవ్వండి. అప్పటి నుంచి బ్రహ్మాండమైన వైఎస్సార్‌ పెళ్లి కానుక అనే పథకాన్ని తీసుకొస్తాం. గతంలో చంద్రబాబు ఇచ్చిన ఆర్థిక సాయాన్ని రెట్టింపు చేసి ఇస్తాం.- 2019 నవంబరు 11న విజయవాడలో నిర్వహించిన మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంత్యుత్సవాల్లో సీఎం జగన్‌ వ్యాఖ్యలు

రూ.90 వేలు రావాలి

వైకాపా ప్రభుత్వం వచ్చాక ఏడాదిపాటు నా పరిధిలోని కొత్త జంటల వివాహాల వివరాలను నమోదు చేశా. 2018లో ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చినప్పటి నుంచి బకాయిలు ఉన్నాయి. దాదాపు రూ.90 వేల వరకు ప్రోత్సాహకం రావాల్సి ఉంది. స్థానిక అధికారుల్ని అడిగితే వాటి గురించి ఇక మరిచిపో అంటున్నారు. - అంజలి, కళ్యాణమిత్ర, తెనాలి

ప్రోత్సాహకాన్ని రెట్టింపు చేస్తామన్నారు

ముఖ్యమంత్రిగా జగన్‌ బాధ్యతలు స్వీకరించాక కళ్యాణమిత్రలు ఆయన్ని కలిస్తే పథకం కొనసాగుతుందని తెలిపారు. ప్రోత్సాహకాన్ని కూడా రెట్టింపు చేస్తామన్నారు. దాదాపు ఏడాదిపాటు పని చేయించుకుని ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా మహిళల్ని మోసం చేశారు. వారి ఉపాధిని కూడా దెబ్బతీశారు. - ధనలక్ష్మీ, కళ్యాణమిత్రల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

ఇదీ చదవండి:కావ్య హత్య కేసు.. నిందుతుడికి తుపాకీ ఎక్కడిది..?

ABOUT THE AUTHOR

...view details