ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Tax revenue పన్నుల రాబడి.. అప్పులకు సరి

Tax revenue రాష్ట్రంలో పన్నుల రాబడి అప్పులకే సరిపోతోంది. రాష్ట్రానికి పన్నుల ద్వారా వచ్చే ఆదాయం రూ. 60,000 కోట్లుగా ఉంటే ఏటా చెల్లించాల్సిన అప్పులు, వడ్డీలు రూ. 50,000 కోట్లుగా ఉంది. అంటే ప్రభుత్వ ఆదాయాన్ని రుణాలు కమ్మేశాయి. అప్పులు తీర్చేందుకు మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ తీరుపై ఇప్పటికే కాగ్‌ హెచ్చరించిన విషయం తెలిసిందే. తప్పు, ముప్పంటున్నా రుణాలు తగ్గడం లేదు.

Revenue
పన్నుల రాబడి

By

Published : Aug 30, 2022, 7:41 AM IST

Tax revenue న రాష్ట్రం ఏటా అప్పులు, వాటిపై వడ్డీల రూపంలో చెల్లించే మొత్తాలు పన్నుల రూపంలో సమకూరే ఆదాయానికి దాదాపు దగ్గరగా ఉన్నాయి. మరోవైపు అప్పులు ఏటా పెరుగుతున్నాయి. వాటికి అనుగుణంగానే చెల్లింపుల భారమూ విజృంభిస్తోంది. వేల కోట్ల అప్పులు తెస్తూ రోజువారీ ఖర్చులకు, జీతాలకు వాడేసుకుంటున్నారు. ఇవన్నీ చాలవన్నట్లు... బహిరంగ మార్కెట్‌ రుణాలు, కార్పొరేషన్ల ద్వారా తెచ్చే గ్యారంటీ రుణాలు, ఇతరత్రా నాన్‌ గ్యారంటీ రుణాలు, పబ్లిక్‌ డెట్‌తోపాటు పెండింగు బిల్లుల భారమూ కలిసి ప్రస్తుతం రూ.8.50 లక్షల కోట్ల చెల్లింపుల భారం రాష్ట్రంపై ఉందని ఒక అంచనా. రాష్ట్రం ప్రతి ఏటా బడ్జెట్‌లో చూపి... చెల్లిస్తున్న వడ్డీలు, పబ్లిక్‌ డెట్‌ చెల్లింపుల మొత్తమే అధికారికంగా దాదాపు రూ.35 వేల కోట్ల వరకు ఉంటోంది. రాబోయే రోజుల్లో ఇది రూ.40 వేల కోట్ల వరకు పెరిగే అవకాశముంది. ఇవికాకుండా కార్పొరేషన్ల అప్పులు, పెండింగు బిల్లుల చెల్లింపు భారం దీనికి అదనం. రాష్ట్రంలోని చాలా ప్రభుత్వ రంగ సంస్థలకు, ప్రభుత్వ కార్పొరేషన్లకు సొంత కార్యకలాపాలు లేవు. ఆదాయాలు లేవు. అవి తీసుకొచ్చే రుణాలను ప్రభుత్వాలే వినియోగించుకుంటున్నాయి. ఆ అప్పులు, వడ్డీలను రాష్ట్ర బడ్జెట్‌ నుంచే చెల్లించాల్సి ఉంటుంది. ఇలా చెల్లించే మొత్తాలు ఏడాదికి రూ.12 వేల కోట్ల నుంచి రూ.15 వేల కోట్ల వరకు ఉంటాయి. ఇవన్నీ కలిపితే సగటున ఏడాదికి రూ.50 వేల కోట్లపై మాటగానే చెల్లింపుల భారం ఉంటుందని నిపుణుల అంచనా.

* రెండేళ్ల కిందట ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారు. రూ.25,000 కోట్ల రుణం తీసుకోవడం లక్ష్యం. కొన్ని మద్యం డిపోల ఆదాయాన్ని ఈ రుణం తీర్చేందుకు కార్పొరేషన్‌కు 13 ఏళ్లపాటు మళ్లిస్తామన్నారు. రూ.వేల కోట్ల విలువైన విశాఖలోని ప్రభుత్వ భూములను తనఖా పెట్టారు. ఈ విధానాన్ని కేంద్ర ఆర్థికశాఖ తప్పు పట్టింది. ఫలితంగా ఎస్‌బీఐ చివర్లో కొంత మేర రుణం నిలిపివేసింది. దీంతో రూ.23,200 కోట్లే రుణం తీసుకున్నారు. 2021 ఆగస్టు నుంచి నెలకు రూ.250 కోట్ల చొప్పున ఈ రుణాన్ని తిరిగి చెల్లిస్తున్నారు. ఏడాదికి రూ.3,000 కోట్లు అవుతుంది. అంటే 13 ఏళ్లలో వడ్డీతో సహా కలిపి దాదాపు రూ.40 వేల కోట్లు చెల్లించాల్సి వస్తుంది.

* బెవరేజెస్‌ కార్పొరేషన్‌ నుంచి డిబెంచర్లు జారీ చేసి, వాటిని అమ్మి రూ.8,305 కోట్ల రుణం తీసుకున్నారు. వడ్డీ 9.6%. పదేళ్లలో తిరిగి చెల్లింస్తామన్నారు. ఏడాదికి రూ.831 కోట్ల అసలు చెల్లించాల్సి ఉంటుంది. దీనికి వడ్డీ అదనం. రాష్ట్ర ఖజానాకు వ్యాట్‌ రూపంలో వచ్చే ఆదాయాన్ని తగ్గించారు. అంతే మొత్తం బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ప్రత్యేక సుంకంగా వసూలు చేసుకునేందుకు అనుమతిచ్చారు. ఆ మొత్తంతోనే రుణం తీర్చాల్సి వస్తుంది. అంటే ఈ కార్పొరేషన్‌ రుణానికి రాష్ట్ర ఆదాయం మళ్లించి తీర్చాల్సి వస్తోంది.

* ఇవి కాక ప్రభుత్వం గ్యారంటీలు ఇచ్చి తీసుకువచ్చిన కార్పొరేషన్ల రుణాలు రూ.1,15,403.58 కోట్లు. ఆ రుణాల చెల్లింపుల భారమూ రాష్ట్ర బడ్జెట్‌పైనే పడుతోంది.

* మరోవైపు పెండింగు బిల్లులు దాదాపు రూ.1.50 లక్షల కోట్లు ఉండవచ్చని అంచనా. ఈ బిల్లుల మొత్తం ఎంతన్న అంశాన్ని ప్రభుత్వం స్పష్టం చేయడంలేదు.

ప్రముఖ రేటింగ్‌ సంస్థ క్రిసిల్‌ 2022 ఆగస్టు 16న ఏం చెప్పిందంటే...

‘ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక నిర్వహణ చాలా బలహీనంగా ఉంది. ఆర్బీఐ కల్పించే చేబదుళ్లు, ప్రత్యేక డ్రాయింగ్‌ సదుపాయం, ఓవర్‌ డ్రాఫ్ట్‌తోనే ఆర్థిక వ్యవస్థను నడిపించాల్సి వస్తోంది. రాష్ట్ర అప్పుల భారం స్థూల జాతీయోత్పత్తిలో 2022 మార్చి నెలాఖరుకు 42.1 శాతంగా ఉంది. రాష్ట్రంలో సాంఘిక, ఆర్థిక మానవ వనరుల సూచీలు కూడా సరైన స్థాయిలో లేవు. వ్యవసాయ అనుబంధ రంగాల నుంచి తప్ప పారిశ్రామిక, సేవా రంగాల నుంచి స్థూల ఉత్పత్తికి అందుతున్న వాటా అంతంత మాత్రమే’

అప్పులు ఇవ్వడంలో బ్యాంకుల తీరూ తప్పే:ఏపీ చేస్తున్న అప్పుల తీరు తప్పని కేంద్ర ఆర్థికశాఖ రాజ్యసభ వేదికగా తేల్చి చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌కు రూ.వేల కోట్ల రుణాలు ఇవ్వడంలో బ్యాంకులు నిబంధనలు పాటించలేదని ఆర్బీఐ తేల్చి చెప్పిందని కూడా కేంద్ర మంత్రి రాజ్యసభలో తాజాగా స్పష్టంచేశారు.

ఇప్పట్లో తీరేవి కావు:ఈ ఏడాది కొన్నిసార్లు నెలకు రూ.8,000 కోట్ల నుంచి రూ.9,000 కోట్ల వరకు రుణాలు తీసుకున్నారు. కార్పొరేషన్ల నుంచి కూడా బడ్జెట్‌ ఆధారంగా రుణాలు తీసుకోవడంతో కేంద్రం విధించిన రుణ పరిమితిని కూడా దాటిపోతున్నాయి.

ప్రభుత్వ రుణాలన్నీ దాదాపు అయిదేళ్ల నుంచి 30 ఏళ్ల వ్యవధిలో తిరిగి చెల్లించే ఒప్పందంపై తీసుకొస్తున్నారు. ఇటీవల వడ్డీల భారమూ ఎక్కువగా ఉంటోంది. కొన్ని సందర్భాల్లో 8% మించి వడ్డీతో రుణాలను సమీకరిస్తున్నారు. పైగా ప్రతినెలా ప్రభుత్వం అప్పులు తీసుకుంటూనే ఉంది. గతంలో నెలకు సగటున రూ.4000 కోట్ల నుంచి రూ.5,000 కోట్ల వరకు మాత్రమే బహిరంగ మార్కెట్‌ రుణం తీసుకునేవారు.

ఇలాగైతే అభివృద్ధి కష్టమేనన్న కాగ్‌

* ‘రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయంలో వడ్డీల కోసం చెల్లించాల్సిన వాటాయే అధికం. గత అయిదేళ్లలో కొత్తగా ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి అప్పులో 65% నుంచి 81% వరకు పాత అప్పులను తీర్చేందుకే వినియోగించాల్సి వస్తోంది. సాధారణంగా అప్పు తీసుకుంటే దానితో ఆస్తులను సృష్టించాలి. అంటే ప్రభుత్వానికి మళ్లీ ఆదాయం అందించేలా అభివృద్ధి కార్యక్రమాలపై వెచ్చించాలి. ఇప్పుడు రోజు వారీ అవసరాలను తీర్చుకునేందుకు, రుణాలపై వడ్డీలను చెల్లించేందుకే మళ్లీ అప్పు తీసుకోవడం అనేది ఆర్థిక అస్థిరతకు దారి తీస్తుంది. రుణాలను చెల్లించేందుకు సరైన ఆర్థిక ప్రణాళిక లేకుంటే అభివృద్ధి పనులకు నిధులు ఉండబోవు.’(2021 నవంబరులో..)

* ‘ఒకవైపు సగటున 6.31% వడ్డీతో అప్పులు తెచ్చుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం వివిధ కంపెనీలు, కార్పొరేషన్లలో రూ.కోట్ల మేర పెట్టుబడులు పెడుతూ కనీసం 0.04% ప్రతిఫలం కూడా పొందడం లేదు. అప్పులు తెచ్చి రెవెన్యూ ఖర్చులకే సింహభాగం వినియోగిస్తున్నారు.. ఇదిలాగే కొనసాగితే అభివృద్ధి కార్యకలాపాలకు వనరులు తగ్గిపోతాయి.’

తప్పుపట్టిన కేంద్ర ఆర్థికశాఖ

బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ద్వారా ఆంధ్రప్రదేశ్‌ తీసుకుంటున్న రుణాలు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 293(3) కింద ఆర్థిక ఉల్లంఘన కిందకు రావని ఎలా చెప్పగలరో తెలియజేయాలంటూ కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి సోమనాథన్‌ ఏపీ సీఎస్‌కు ఈ ఏడాది ఆగస్టు 22న లేఖ రాశారు. ఇదే అంశంపై చర్చించేందుకు దిల్లీ పిలిపించారు. అంతేకాదు... ఆంధ్రప్రదేశ్‌లోని కార్పొరేషన్లకు రుణాలు ఇచ్చే సందర్భంలో జాగ్రత్తగా వ్యవహరించాలని కేంద్ర ఆర్థికశాఖ వివిధ బ్యాంకులను గతంలో హెచ్చరించింది.

పన్నుల రాబడి

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details