గణనీయంగా పెరుగుతున్న కరోనా పాజిటివ్ బాధితులకు చికిత్స అందించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే 4 ప్రైవేటు వైద్య కళాశాలలను కరోనా ప్రత్యేక ఆస్పత్రులుగా మార్చిన ప్రభుత్వం.. 13 జిల్లాల్లోని ఆస్పత్రుల్లోనూ ఐసీయూ పడకల సంఖ్య పెంచాలని నిర్ణయించింది. అవసరానికి తగ్గట్లు వెంటిలేటర్లనూ సమకూర్చుకోవాలని అధికారులకు ప్రభుత్వం సూచించింది. చిత్తూరు, నెల్లూరు, కృష్ణా, విశాఖ జిల్లాల్లోని రాష్ట్ర స్థాయి కరోనా ఆస్పత్రుల్లో.. 444 ఐసీయూ పడకలు, 444 వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు వెల్లడించారు. 1370 నాన్ ఐసీయూ పడకలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.
13 జిల్లాల్లోని జిల్లా స్థాయి కరోనా ఆస్పత్రుల్లో 445 ఐసీయూ పడకలు, వెంటిలేటర్లు సిద్ధంగా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. 8,950 నాన్ ఐసీయూ పడకలున్నాయని తెలిపారు. అన్ని జిల్లాల్లోనూ 4 వేల 799 మంది వైద్యులు, 16 వేల 481 మంది పారామెడికల్ సిబ్బంది, నర్సులు పనిచేస్తున్నట్టు ప్రకటించారు. మొత్తం లక్షా 3 వేల 750 పీపీఈ కిట్లు.. 98 వేలకు పైగా ఎన్-95 మాస్కులు అందుబాటులో ఉన్నట్టు వెల్లడించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ 10,505 నమూనాలు పరీక్షించినట్లు అధికారులు వెల్లడించారు. ఇకపై రోజువారీ నమూనాల సేకరణ, నిర్ధరణ పరీక్షల సంఖ్య 990కి పెంచే యోచనలో ఉన్నట్లు చెప్పారు. 13 జిల్లాల్లో 338 క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం 59 వేల 686 పడకలు ఉన్నాయని తెలిపింది. ప్రస్తుతం క్వారంటైన్ కేంద్రాల్లో 5 వేల 864 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు.