లాక్‌డౌన్‌తో కష్టాల్లో ఉన్న సినీపరిశ్రమ సమస్యలకు పరిష్కారం, పరిశ్రమ అభివృద్ధి లక్ష్యంగా సీఎం జగన్‌తో తెలుగు సినీప్రముఖులు సమావేశమయ్యారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకున్న వారంతా.. విజయవాడ కరకట్ట సమీపంలోని ఓ అతిథి గృహంలో బసచేశారు. మధ్యాహ్నం 3 గంటలకు అంతా కలసి తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయానికి వెళ్లి సీఎం జగన్ ను కలిశారు. మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో నాగార్జున, రాజమౌళి, నిర్మాతలు సురేశ్, దిల్‌రాజు, సి.కల్యాణ్ సీఎంతో భేటీ అయ్యారు. చిన్న సినిమాల నిర్మాతల సమస్యలు, నందిఅవార్డులు సహా పలు అంశాలపై సీఎం జగన్‌తో సినీప్రముఖులు చర్చించారు. మంత్రి పేర్ని నాని, రాష్ట్ర చలనచిత్ర పరిశ్రమాభివృద్ధి సంస్థ ఛైర్మన్ విజయ్ చందర్, వైకాపా నేత పొట్లూరి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఏపీలో షూటింగ్‌లకు అనుమతిచ్చారు: చిరంజీవి
సీఎం దృష్టికి తీసుకెళ్లిన సమస్యలన్నిటిపైనా సానుకూలంగా స్పందించారని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. ఏడాది కాలంగా సీఎం జగన్‌ను కలవాలనుకున్నామని, రాష్ట్రంలో షూటింగ్‌లకు ముందుగానే అనుమతి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపామని చెప్పారు. లాక్‌డౌన్‌తో కష్టాల్లో ఉన్న థియేటర్ల యజమానులను ఆదుకునేందుకు వినోదపన్ను మినహాయించాలని కోరామన్నారు. థియేటర్ల టికెట్ల జారీలో పారదర్శకత, నంది పురస్కారాలకు ప్రభుత్వ ప్రోత్సాహం, కరోనా లాక్‌డౌన్‌లో తీవ్రంగా దెబ్బతిన్న సినీపరిశ్రమకు ఆర్థిక వెసులుబాటు కల్పించేలా పన్నుమినహాయింపు వంటి అంశాలను సీఎంతో చర్చించామని చెప్పారు. వాటి పరిష్కారానికి మంత్రులు, అధికారులతో చర్చించి తగు నిర్ణయాలు తీసుకుంటామని సీఎం జగన్ హామీ ఇచ్చారని చిరంజీవి తెలిపారు.