ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: 'పది' పరీక్షల తర్వాతే బడి గంట

కరోనా నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలలను దశల వారీగా తెరవాలని విద్యాశాఖ యోచిస్తోంది. జులై 5వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నందున ఆ తర్వాతే పాఠశాలలు తెరవాలని భావిస్తున్నారు.

telangana-schools-starts-after-july-fifth-when-ssc-exams-are-finished
తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలలను దశల వారీగా తెరిచేందుకు ఏర్పాట్లు

By

Published : May 29, 2020, 9:56 AM IST

లాక్​డౌన్​ వల్ల మూతపడ్డ పాఠశాలలు తెరిచేందుకు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ యోచన చేస్తోంది. జులై 5న పదో తరగతి పరీక్షలు ముగియనున్నందున ఆ తర్వాతే పాఠశాలలు తెరవాలని భావిస్తోంది. ఒకేసారి కాకుండా మొదట 8, 9, 10 విద్యార్థులకు తరగతులు ప్రారంభించాలని భావిస్తోంది. దానివల్ల భద్రతపరంగా ప్రణాళికా లోపాలుంటే బయటపడతాయన్నది వ్యూహం.

విద్యా సంవత్సరం ఎప్పుడు ప్రారంభించాలో నిర్ణయించేందుకు పాఠశాల విద్యాశాఖ సమాయత్తమవుతోంది. దీనిపై తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం మధ్యాహ్నం ఉపాధ్యాయ ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించనున్నారు. పాఠశాలల ప్రారంభంపై రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) వ్యూహపత్రం రూపొందించింది. దానిపై తెలంగాణ విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌ సమక్షంలో విద్యాశాఖ అధికారులు చర్చించారు. మొత్తానికి జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) మార్గదర్శకాలు జారీ అయిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలనిభావిస్తున్నారు.

విద్యావేత్తలు, మేధావులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సలహాలను కూడా స్వీకరించాలని కొందరు సూచిస్తున్నారు. అధికారులు మాత్రం వివిధ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల అభిప్రాయాలు, సలహాలను లిఖితపూర్వకంగా తీసుకున్నారు.

ఇదీ విద్యాశాఖ ప్రణాళిక

  • మొదట కొద్ది రోజులు ఉపాధ్యాయులు విధులకు హాజరై పాఠశాలలను సన్నద్ధం చేయాలి. నీటి వసతి, మరుగుదొడ్లు, ఫర్నిచర్‌ తదితరాలను సిద్ధం చేయాలి. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా బడి నిర్వహణకు ప్రణాళిక రూపొందించుకోవాలి.
  • తొలుత 8, 9, 10 తరగతులను మొదలుపెట్టాలి. తర్వాత 6, 7 తరగతులు ప్రారంభించాలి. ప్రాథమిక పాఠశాలలను ఆలస్యంగా మొదలుపెట్టాలి.
  • విద్యార్థుల మధ్య భౌతిక దూరం పాటించేలా విరామ (ఇంటర్వెల్‌), మధ్యాహ్న భోజన సమయాలు ఒక్కో తరగతికి ఒక్కోలా ఉండాలి. విద్యార్థుల సంఖ్యను బట్టి దీన్ని నిర్ణయించాలి.
  • బడి ముగిశాక, అందరినీ ఒకేసారి కాకుండా 5-10 నిమిషాల వ్యవధిలో ఒక్కో తరగతి విద్యార్థులను బయటకు పంపాలి.
  • థర్మల్‌ స్క్రీనింగ్‌, మాస్కులు తప్పనిసరి.

ABOUT THE AUTHOR

...view details