ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పదేపదే నేరాల్లో పాత నిందితులు.. దేశవ్యాప్తంగా తెలంగాణది మూడో స్థానం

NCRB: పాత నేరగాళ్లు పదేపదే నేరాలకు పాల్పడి జైలుకు వెళ్తున్న ఘటనల్లో తెలంగాణ మూడో స్థానంలో నిలిచిందని ఎన్​సీఆర్​బీ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 2021లో ఈ తరహా ఉదంతాలు 1,02,779 నమోదైనట్టు నివేదికలో తెలిపింది. యూపీలో అత్యధికంగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోగా..రెండో స్థానంలో మధ్యప్రదేశ్‌ ఉందని పేర్కొంది.

http://10.10.50.85:6060//finalout4/telangana-nle/thumbnail/04-September-2022/16279257_1061_16279257_1662269315337.png
పదేపదే నేరాల్లో పాత నిందితులు.. దేశవ్యాప్తంగా తెలంగాణది మూడో స్థానం

By

Published : Sep 4, 2022, 3:17 PM IST

NCRB: పాత నేరస్థులు, నిందితులు తిరిగి నేరాలకు పాల్పడి జైలు పాలవుతున్న ఉదంతాల్లో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. 2021లో దేశవ్యాప్తంగా ఈ తరహా కేసులు 1,02,779 నమోదు కాగా.. ఉత్తర్‌ప్రదేశ్‌లో అత్యధికంగా 16,049 చోటుచేసుకున్నాయి. మధ్యప్రదేశ్‌లో 14,646.. తెలంగాణలో 13,136 వెలుగుచూశాయి. జాతీయ నేరగణాంక సంస్థ(ఎన్‌సీఆర్‌బీ) తాజాగా విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది.

దేశవ్యాప్తంగా 2,891 మంది పాత నేరస్థులున్నట్లు నివేదిక వెల్లడించింది. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో వీరి సంఖ్య 1001 కాగా.. తర్వాతి స్థానం తెలంగాణ (381)దే కావడం గమనార్హం.

* రాష్ట్రంలో మొత్తం 7,316 మంది (మహిళలు- 472) జైళ్లలో ఉన్నారు. వీరిలో శిక్ష ఖరారైన వారు 2,124 (మహిళలు-125) మంది కాగా.. విచారణ ఎదుర్కొంటున్నవారు 4,796 (మహిళలు-330).. నిర్బంధంలో 396 (మహిళలు-17) మంది ఉన్నారు.

* శిక్ష ఖరారై జైళ్లలో ఉన్న వారిలో హంతకులు 1282 మంది, దొంగలు 199 మంది, అత్యాచారానికి పాల్పడినవారు 187 మంది ఉన్నారు.

ఆరుగురికి మరణ శిక్ష ఖరారు

* రాష్ట్రంలోని జైళ్లలో మరణశిక్ష ఖరారైన ఖైదీలు ఆరుగురు, జీవితఖైదీలు 1461 మంది ఉన్నారు.

* దోషుల్లో నిరాక్షరాస్యులు 405 మంది, పదో తరగతిలోపు చదివినవారు 895 మంది, గ్యాడ్యుయేషన్‌లోపు 671 మంది, గ్యాడ్యుయేట్లు 121 మంది.. బీటెక్‌/డిప్లొమా హోల్డర్లు 8 మంది.. పోస్టుగ్రాడ్యుయేట్లు 24 మంది ఉన్నారు.

* 18-30 ఏళ్లలోపు 624 మంది.. 30-50 ఏళ్లలోపు 1174 మంది.. 50 ఏళ్లు పైబడినవారు 326 మంది ఉన్నారు.

విచారణ ఖైదీల్లో నైజీరియన్లే అధికం:తెలంగాణ జైళ్లలో 59 మంది విదేశీ ఖైదీలున్నారు. వీరిలో శిక్ష అనుభవిస్తున్నవారు ఆరుగురు కాగా.. 43 మంది విచారణ ఎదుర్కొంటున్నారు. మరో 10 మంది నిర్బంధంలో ఉన్నారు. విచారణ ఖైదీల్లో 14 మంది నైజీరియన్లు, 12 మంది బంగ్లాదేశీయులు, 9 మంది ఇతర ఆఫ్రికన్లు, అయిదుగురు మయన్మార్‌ దేశస్థులు, ఇద్దరు నేపాలీలు, ఒక పాకిస్థానీ ఉన్నారు.

ఖైదీల అక్షరాస్యతలో రెండోస్థానం:జైళ్లలో విద్యనందించడంలో తెలంగాణ రెండో స్థానంలో ఉంది. బిహార్‌లో అత్యధికంగా 8,923 మందికి, తెలంగాణలో 6,954 మందికి ప్రాథమిక విద్యనందించారు. దూరవిద్యా విధానంలో పలువురికి పీజీ విద్యను అందించారు. 1217 మందికి వృత్తివిద్యా కోర్సులు బోధించారు.

జీవిత ఖైదీల్లో ఆరో స్థానం

* దేశవ్యాప్తంగా శిక్ష అనుభవిస్తున్న 1,22,852 మందిలో జీవిత ఖైదీలు 73,508 (59.8%) మంది ఉన్నారు. ఈ విషయంలో 75.7%తో ఆంధ్రప్రదేశ్‌ తొలిస్థానంలో ఉంది. తెలంగాణ (68.8%) ఆరో స్థానంలో ఉంది. రాష్ట్రంలో 396 మంది నిర్బంధంలో ఉండగా.. ఈ విషయంలో రాష్ట్రం రెండో స్థానంలో ఉంది.

* 4,796 మంది విచారణ ఖైదీల్లో 1 నుంచి 3 నెలల్లోపు జైళ్లలో ఉన్నవారు 70.3%, 3-6 నెలల్లోపు 13.5%, 6-12 నెలల్లోపు 8.7%, 1-2 ఏళ్లుగా 5.2%, 2-3 ఏళ్లుగా 1.5%, 3-5 ఏళ్లుగా 0.6%, 5 ఏళ్లకుపైగా 0.2% మంది జైళ్లలో ఉన్నారు.

* జైళ్ల సామర్థ్యాన్ని మించి మహిళా ఖైదీలున్న విషయంలో తెలంగాణది మూడోస్థానం. ఈ విషయంలో జాతీయ సగటు 56.3% కాగా.. బిహార్‌లో అత్యధికంగా 115.8% ఆక్యుపెన్సీ రేటుంది. మహారాష్ట్రలో 109.2%.. తెలంగాణలో 108.8% ఉంది.

* దేశవ్యాప్తంగా 22,918 మంది మహిళా ఖైదీల్లో 3,803 (16.6%) మంది మాత్రమే మహిళా జైళ్లలో ఉన్నారు. మిగిలిన 19,115 (83.4%) మంది సాధారణ జైళ్లలో ఉన్నారు. సాధారణ జైళ్లలో మహిళా ఖైదీల ఆక్యుపెన్సీ తెలంగాణలో 42.7% ఉంది.

* దేశవ్యాప్తంగా 1650 మంది మహిళా ఖైదీలతో చిన్నారులైన వారి పిల్లలు (1867 మంది) జైళ్లలో ఉన్నారు. ఈ విషయంలో తెలంగాణ 10వ స్థానంలో ఉంది. ఇక్కడ 41 మంది వద్ద 44 మంది పిల్లలున్నారు.

ఒక్కో ఖైదీ సగటు వస్తువుల ఉత్పత్తి రూ.56,880

* జైళ్లలో ఖైదీలు తయారుచేసే ఉత్పత్తుల విలువపరంగా తమిళనాడు రూ.65.17 కోట్లతో అగ్రస్థానంలో నిలవగా.. తెలంగాణ రూ.41.61 కోట్లతో రెండోస్థానంలో ఉంది. తెలంగాణలో ఒక్కో ఖైదీ సగటున రూ.56,880 విలువైన వస్తువుల్ని ఉత్పత్తి చేశాడు. చండీగఢ్‌ (రూ.95,114) తర్వాత ఇది దేశంలోనే రెండో అత్యధిక సగటు.

* ఖైదీలను రిమాండ్‌కు తీసుకోవడంలో ఉత్తర్‌ప్రదేశ్‌ (40,921) తర్వాతి స్థానం తెలంగాణ (13,311)దే.

7,316 మందికి సంస్కరించే సిబ్బంది ఒక్కరే..

* రాష్ట్రంలోని జైళ్లలో మంజూరైన సిబ్బంది సంఖ్య 1927 కాగా.. 1543 (80.07%) మంది ఉన్నారు. ఈ విషయంలో జాతీయ సగటు 71.96%. 8 మంది ఖైదీలకు ఒక సిబ్బంది ఉండాలనేది జాతీయ సగటు కాగా.. తెలంగాణలో నలుగురికి ఒక సిబ్బంది ఉన్నారు.

* కరెక్షనల్‌ స్టాఫ్‌ (సంస్కరించే సిబ్బంది) 7,316 మంది ఖైదీలకు ఒక్కరే ఉన్నారు.

* తెలంగాణ జైళ్లశాఖ మొత్తం వ్యయంలో 19.1% మాత్రమే ఖైదీల కోసం వెచ్చిస్తోంది. ఈవిషయంలో జాతీయ సగటు 31.3% ఉండటం గమనార్హం.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details