ట్రాఫిక్ నియమాలు పాటించేలా అవగాహన చేపట్టడమైనా.. రోడ్డు భద్రతా నియమాలను ప్రజలకు వివరించడంలోనైనా వినూత్నంగా ప్రచారం చేసే సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొద్దిరోజుల నుంచి వారి ట్రెండ్ మార్చారు. రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్న వారిలో ఎక్కువగా యువతే ఉంటోందని గ్రహించిన వీరు వారి పంథాలోనే అవగాహన కల్పించడం మొదలుపెట్టారు. యూత్‌కి చేరువయ్యేలా.. మీమ్స్‌తో ఇటు ట్రెండ్ సృష్టించడమే కాదు.. వారు చెప్పాలనుకున్న విషయాన్ని స్పష్టంగా కాస్త హాస్యం జోడించి చెబుతున్నారు. అలా ఈరోజు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చేసిన ఓ మీమ్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇంతకీ అదేంటంటే..
ప్రతి చోటా రెగ్యులర్ కస్టమర్లు ఉన్నట్లే.. ఈ మధ్య ట్రాఫిక్ చలాన్లకు అలాంటి వారు ఉంటున్నారు. అలాంటి ఓ రెగ్యులర్ కస్టమర్.. తన వాహనానికి చలానా విధించిన రోజే విధిగా ఆన్లైన్ డబ్బు చెల్లిస్తున్నాడు. ఇది గమనించిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.. ఏ రోజు ఫైన్ ఆరోజు కట్టకపోతే ఓ హెల్మెట్ పెట్టుకోవచ్చుగా గురువు గారూ.. అంటూ ఓ సరదా మీమ్‌ను ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ మీమ్ తెగ వైరల్ అవుతోంది. అంతేగా మరి.. చలానా చెల్లించడంలో చూపించిన నిబద్ధత.. హెల్మెట్ పెట్టుకుని వాహనం నడపడంలో చూపిస్తే బాగుంటుందిగా!