ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

safety measures: రైళ్లలో భద్రతకు మార్గదర్శకాలు!

రైల్వే స్టేషన్లలో చేపట్టాల్సిన భద్రతా చర్యలపై రైల్వేశాఖకు సూచనలు చేసేందుకు తెలంగాణ పోలీసులశాఖ సిద్ధమవుతోంది. విమానాశ్రయాల తరహాలోనే రైళ్లలో ప్రయాణించే ప్రజలను, తీసుకెళ్లే సామగ్రిని క్షుణ్నంగా తనిఖీ చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేస్తోంది.

By

Published : Aug 2, 2021, 11:08 AM IST

telangana-police
telangana-police

అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రైల్వే స్టేషన్లలో చేపట్టాల్సిన భద్రతా చర్యలపై రైల్వేశాఖకు సూచనలు చేసేందుకు తెలంగాణ పోలీసుశాఖ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా విమానాశ్రయాల తరహాలోనే రైళ్లలోకి వెళ్లే సామగ్రిని క్షుణ్నంగా తనిఖీ చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేస్తోంది. ఎలాంటి ఆటంకాలు లేకుండా దర్బంగా నిందితులు పేలుడు పదార్థాలను రైల్లోకి చేర్చిన ఉదంతం నేపథ్యంలో భవిష్యత్తులో ఇలాంటివి నివారించేందుకు దృష్టి సారించింది.

అదృష్టవశాత్తూ రైల్లో పేలలేదు

బిహార్‌లోని దర్బంగా రైల్వేస్టేషన్లో జూన్‌ 17వ తేదీన జరిగిన పేలుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దీనిపై దర్యాప్తు చేపట్టిన అధికారులు సికింద్రాబాద్‌లో ఈ మూటను రైల్లోకి ఎక్కించినట్లు గుర్తించారు. తదనంతర దర్యాప్తులో ఈ మూటను బుక్‌ చేసిన.. హైదరాబాద్‌కు చెందిన నాసిర్‌ఖాన్‌, ఇమ్రాన్‌ మాలిక్‌లను అరెస్టు చేశారు. దర్బంగా రైల్లో పేలుడు జరిపి తద్వారా భారీగా ప్రాణనష్టం చేకూర్చే ఉద్దేశంతోనే దుస్తుల మూట మాటున మండే స్వభావం ఉన్న రసాయనాలతో చేసిన బాంబును రైల్లోకి ఎక్కించినట్లు తేలింది. అదృష్టవశాత్తూ కదులుతున్న రైల్లో పేలుడు సంభవించలేదు. ఒకవేళ జరిగి ఉంటే కనీసం మూడు బోగీలు నామరూపాలు లేకుండా పోయేవని అధికారులే చెబుతున్నారు.

ఒకటే మార్గం ఉండాలి..

1993 డిసెంబరు 6వ తేదీన హైదరాబాద్‌ నుంచి దిల్లీ వెళ్లే ఏపీ ఎక్స్‌ప్రెస్‌ రైలు మౌలాలి స్టేషన్‌కు చేరుకోగానే పేలుడు జరిగింది. అదే సమయంలో దేశవ్యాప్తంగా ఆరు రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో పేలుళ్లు జరిగాయి. ఇటువంటి ఉదంతాల నేపథ్యంలో రైళ్లలో భద్రతపై అధికారులు దృష్టి సారించారు. ముఖ్యంగా రైల్లోకి తీసుకెళ్లే సామగ్రిని క్షుణ్నంగా పరిశీలించకపోతే ఇలాంటి ముప్పు తప్పదని అధికారులు అభిప్రాయ పడుతున్నారు. ప్రయాణికులు తీసుకెళుతున్న సామగ్రినేకాదు రైళ్లలో రవాణా చేసే సరకులను కూడా ఎలాంటి తనిఖీలు లేకుండానే రైల్లోకి అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో రైల్వేస్టేషన్లలోకి వెళ్లేందుకు, బయటకు వచ్చేందుకు ఒకటే మార్గం ఉండాలని, ప్రయాణికుల సామగ్రితోపాటు పార్సిల్‌ ద్వారా పంపే ప్రతి మూటను స్కానర్ల ద్వారా క్షుణ్నంగా పరిశీలించాలని ప్రతిపాదించబోతున్నారు. దీనివల్ల ప్రమాదాన్ని ముందుగానే నివారించవచ్చు. దీనికి సంబంధించి మార్గదర్శకాలు రూపొందించిన తర్వాత రైల్వే అధికారులకు అందజేయనున్నారు.

ఇదీ చూడండి: ఏపీఎస్‌డీసీ నిబంధనలు కొన్ని రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయి: కేంద్రం

ABOUT THE AUTHOR

...view details