తెలంగాణ-ఏపీ జలవివాదంపై రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్(Minister srinivas Goud) స్పందించారు. తెలంగాణలో ఏపీ ప్రజలు ఉన్నారని ఆలోచిస్తున్నానని.. వారిని ఇబ్బంది పెడతారనే ఎక్కువగా మాట్లాడట్లేదన్న ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. జగన్ అలా మాట్లాడటం బాధాకరమన్నారు. గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాలిచ్చినా ఖాతరు చేయకుండా.. కేంద్ర మంత్రికి ఇచ్చిన మాటను పెడచెవిన పెట్టి అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా ప్రాజెక్టు నిర్మాణం మొదలుపెట్టారని ఆరోపించారు. మిగులు జలాల పేరుతో పాలమూరు ప్రజలకు అన్యాయం చేస్తున్నారని వాపోయారు. 44వేల క్యూసెక్కుల నీటిని తీసుకెళ్లడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.
తెలంగాణ వచ్చాక ఏపీ వాసులను ఇబ్బంది పెట్టలేదని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఏపీకి చెందిన ఉద్యోగులు, వ్యాపారులు, కాంట్రాక్టర్ల అందరి కోసం కేసీఆర్ ఆలోచించారని తెలిపారు.