వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్‌ఆర్‌ఎస్ నిబంధనలు సడలిస్తూ రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు వీలుగా అవకాశం కల్పించింది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్లకు అడ్డంకులు తొలగిపోనున్నాయి. రిజిస్ట్రేషన్ అయిన వాటికి తదుపరి రిజిస్ట్రేషన్లు కొనసాగించవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. అనుమతులు లేని, క్రమబద్ధీకరణ కాని కొత్త ప్లాట్ల రిజిస్ట్రేషన్లు మాత్రం కుదరవని పేర్కొంది.
మూడు నెలలుగా ఆగిన రిజిస్ట్రేషన్లు
అనుమతులు ఉన్న, క్రమబద్ధీకరణ అయిన ప్లాట్లలకు రిజిస్ట్రేషన్లు యథాతథంగా కొనసాగుతాయని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఎల్‌ఆర్‌ఎస్ నిబంధన వల్ల మూడు నెలలుగా రిజిస్ట్రేషన్‌లు నిలిచిపోయాయి. లావాదేవీలు ఆగిపోవడం వల్ల స్థిరాస్తి వ్యాపారులతో పాటు ఖాళీ స్థలాలు ఉన్న యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. ఎల్‌ఆర్‌ఎస్ కోసం ప్రభుత్వ ఆదేశాల మేరకు భారీగా దరఖాస్తులు చేసుకున్నారు. ఆ ప్రక్రియంతా పూర్తయ్యేందుకు చాలా సమయం పట్టేలా ఉంది. ఈ లోపు రిజిస్ట్రేషన్‌లు ఆగిపోయి.. ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.