Land Values in TS: తెలంగాణలో వచ్చే నెల ఒకటో తేదీ నుంచి పెంచనున్న వ్యవసాయ, వ్యవసాయేతర భూముల విలువలను కమిటీల ఆమోదానికి స్టాంపులు, రిజిస్ట్రేషన్‌శాఖ జిల్లాలకు పంపించింది. గురువారం జిల్లా రిజిస్ట్రార్లతో సమావేశమైన స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ శేషాద్రి... విలువల పెంపు అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు మినహా అన్ని జిల్లాలకు చెందిన వివరాలను స్వయంగా ఆయా జిల్లాల రిజిస్ట్రార్లు తీసుకెళ్లారు. బహిరంగ మార్కెట్ విలువలు, రిజిస్ట్రేషన్ విలువలను ఆధారం చేసుకుని సగటున అపార్టమెంట్లకు 25శాతం, ఖాళీ స్థలాలకు 35శాతం, వ్యవసాయ భూములకు 50శాతం పెంచుతున్నట్లు స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ స్పష్టం చేసింది. కానీ ఆయా ప్రాంతాల ప్రాధాన్యత దృష్టిలో పెట్టుకుని కూడా విలువల నిర్దారణ ఉంటుందని వెల్లడించింది. సవరించిన మార్కెట్ విలువలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు ప్రభుత్వం కలెక్టర్లకు సమాచారం ఇచ్చింది.
మార్కెట్ విలువలను బట్టి..
తెలంగాణ మొత్తం మీద 500 నుంచి 600 గ్రామాలు పొటెన్షియాలిటీ కలిగినవిగా అధికారులు గుర్తించారు. వందల సంఖ్యలో పట్టణాలు, పదుల సంఖ్యలో నగరాలు ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. వ్యవసాయ భూముల విలువల పెంపునకు సంబంధించి 50శాతం అని చెబుతున్నా... బహిరంగ మార్కెట్ విలువలను బట్టి ఆయా ప్రాంతాల్లో మరో రెండు స్లాబులు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఖాళీ స్థలాలపై 35శాతం విలువలు పెంచుతున్నా.. ప్రాధాన్యత ప్రాంతాల ఆధారంగా అంతకంటే తక్కువ, ఎక్కువ ఉండొచ్చని చెబుతున్నారు. అపార్ట్‌మెంట్ల విషయంలో చదరపు అడుగు 4వేలకు మించి రిజిస్ట్రేషన్ విలువలు ఉన్నట్లు నిర్దేశించినా.. 25శాతం స్లాబు కంటే తగ్గుతుందని అధికారులు పేర్కొన్నారు. ఇలా ప్రతి విభాగంలో మూడు స్లాబులు ఉన్నట్లు స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.