ప్రజల ధన, మాన, ప్రాణాల రక్షణ కోసం రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమం చేపట్టినట్లు.... తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఈ పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వైకాపా 9 నెలల పాలనకు సంబంధించి 26అంశాలతో కూడిన ప్రచార పత్రాన్ని..చంద్రబాబు అమరావతి పార్టీ కేంద్ర కార్యాలయంలో విడుదల చేశారు. "రద్దుల ప్రభుత్వం, రివర్స్ పాలన" పేరిట విడుదల చేసిన ఈ పత్రంలో.... వైకాపాపై తీవ్రస్థాయిలో విమర్శలు సంధించారు. తెలుగుదేశం హయాంలో పేదలకు మంచిచేసిన అనేక సంక్షేమ పథకాలను రద్దు చేసి.... ప్రభుత్వం పేదల కడుపుకొట్టిందన్నారు. సమాజంలోని అన్ని వర్గాలను వంచించిందని ధ్వజమెత్తారు. ఇసుక, కేబుల్, గ్యాస్, కరెంటు, ఆర్టీసీ, పెట్రోల్, డీజిల్‌తో పాటు నిత్యావసర సరుకుల ధరలు పెంచి బడుగులపై భారాలు మోపిందని ఆక్షేపించారు. వైన్, మైన్, ల్యాండ్, శాండ్ మాఫియాగా మారి.... వైకాపా నాయకులు 10 నెల్లోనే 20 వేల కోట్ల జె-ట్యాక్స్ వసూలు చేసుకున్నారని పత్రంలో ఆరోపించారు.
'ఓటు అనే ఆయుధంతో వైకాపాకు బుద్ధి చెప్పండి' - local elections andhra
రాజ్యాంగం ఎంత మంచిదైనా, అమలు చేసేవాడు చెడ్డవాడైతే.. పరిస్థితులు ఎంత భయానకంగా ఉంటాయనే దానికి.. వైకాపా పాలనే నిదర్శనమని తెదేపా అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. జగన్ మోసకారి సంక్షేమంపై నిజపత్రం అంటూ.... స్థానిక పోరు కోసం ప్రచార పత్రాన్ని ఆయన విడుదల చేశారు. ఓటు అనే ఆయుధంతో వైకాపా దుర్మార్గాలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
సంక్షేమాన్ని నీరుగార్చి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన వైకాపాను అడ్డుకోవడానికే తెదేపా పోరాటానికి దిగిందని చంద్రబాబు తెలిపారు. ఈ పోరాటంలో కొందరు ప్రలోభాలకు లొంగినా.... వెనకడుగు వేయమన్నారు. ఈసీ ఎన్నికలను నిష్పక్షపాతంగా జరపడం లేదని మరోసారి మండిపడిన తెదేపా అధినేత.... పార్టీ అభ్యర్థులకు తమ న్యాయవాదుల ద్వారా బీ ఫారాలు అందజేస్తామన్నారు. 9 నెలల వైకాపా అరాచకాన్ని గమనించిన ప్రజలు ఇకనైనా మేల్కోవాలని... ఓటు అనే ఆయుధంతో దుర్మార్గులకు బుద్ధిచెప్పాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.