ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TDP: కమీషన్ల కోసమే మరో ఎత్తిపోతల పథకం: తెదేపా

కమీషన్ల కోసమే పోలవరం లోపల మరో ఎత్తిపోతల పథకానికి సీఎం జగన్ ప్రణాళికలు రచిస్తున్నారని తెదేపా నేతలు విమర్శించారు. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్రంలోని అనేక సమస్యలపై చర్చించారు. జగన్ దాచుకున్న అవినీతి సొమ్ము హెటిరోలో బయటపడిందని నేతలు ఆరోపించారు. విమానాల్లో వాడే ఇంధనం కంటే రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయని ధ్వజమెత్తారు.

tdp
tdp

By

Published : Oct 18, 2021, 4:16 PM IST

Updated : Oct 18, 2021, 7:40 PM IST

వెయ్యి కోట్ల రూపాయలతో పోలవరం ప్రాజెక్టులో మరో ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని.. ఇది కమీషన్ల కోసమేనని తెలుగుదేశం నేతలు ఆరోపించారు. వైకాపా ప్రభుత్వం వల్ల.. నదీ జలాల్లో బచావత్ ట్రైబ్యునల్‌ హక్కుల్ని రాష్ట్రం కోల్పోయిందన్న నేతలు.. పోలవరం, నదుల అనుసంధాన ప్రాజెక్టుల్ని అస్తవ్యస్తం చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన వ్యూహకమిటీ సమావేశంలో ఈ విమర్శలు చేసిన నేతలు.. నిర్వీర్యమవుతున్నసాగునీటి ప్రాజెక్టుల సందర్శన కోసం పార్టీ తరపున ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు.

బినామీల ఆస్తుల్ని పెంచుకుంటున్నారు..
జే ట్యాక్స్, అవినీతి, భూ మాఫియా ద్వారా దోచుకున్న సొమ్మును.. సీఎం జగన్ హెటిరోలో దాచుకున్నారని నేతలు ఆరోపించారు. ప్రజల్ని అప్పులపాలు చేసి, తన బంధువులు, బినామీల ఆస్తుల్ని జగన్ పెంచుకున్నారని దుయ్యబట్టారు. అక్రమాస్తుల కేసులో జగన్‌ సహ నిందితులుగా ఉన్న రాంకీ, హెటిరో సంస్థల్లో పెద్దమొత్తంలో నల్లధనం వెలుగుచూడటాన్ని నేతలు ఉదహరించారు. అత్యధికంగా పన్నులు వసూలు చేస్తూ.. అన్ని రంగాల్ని కుదేలు చేశారని విమర్శించారు.

యథేచ్ఛగా భూ ఆక్రమణలు..
విశాఖ గ్రామీణ జిల్లా పరిధిలో ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో వైకాపా నేతలు వ్యవసాయ భూముల్ని ఆక్రమించుకుని.. అక్రమ మైనింగ్‌ చేస్తున్నారని తెదేపా నేతలు ఆరోపించారు. 80కి పైగా నియోజకవర్గాల్లో సాగుతున్న అక్రమ మైనింగ్‌ను క్షేత్రస్థాయిలో ఎండగట్టి రైతులకు అండగా నిలవాలని సమావేశంలో నిర్ణయించారు. అధికారంలోకి వచ్చాక ఆరుసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి వినియోగదారులపై సుమారు 37 వేల కోట్ల రూపాయల భారాన్ని జగన్ సర్కారు మోపిందని విమర్శించారు.

నిధుల దారి మళ్లింపు..
15వ ఆర్థిక సంఘం నిధుల్ని దారి మళ్లించి గ్రామాలను అనారోగ్య సమస్యలకు నిలయంగా మార్చారని తెదేపా ఆక్షేపించింది. పంట ఉత్పత్తులకు ధరలు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇక, అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మత విశ్వాసాలను వైకాపా దెబ్బతీస్తోందని ధ్వజమెత్తారు. ఫించన్, రేషన్ కార్డులు తొలగిస్తున్నారని విమర్శించారు. అదేవిధంగా.. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ప్రజల్ని భక్షించే వ్యవస్థగా మారిందని.. 20మంది పోలీసు అధికారులపై ఈ నెలలో ప్రైవేటు కేసులు వేసినట్లు తెలిపారు. విశాఖ మన్యంలో గంజాయి స్మగ్లర్లపై తెలంగాణ పోలీసులు కాల్పులు జరిపి అరెస్టు చేయటం, రాష్ట్ర పోలీసు వ్యవస్థకు సిగ్గుచేటని నేతలు ఆక్షేపించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న అవినీతి, అసమర్థ పాలనకు వ్యతిరేకంగా.. క్షేత్రస్థాయిలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని తెదేపా నిర్ణయించింది.

ఇదీ చదవండి:

హిందూపురం ప్రభుత్వాస్పత్రిలో.. ఎమ్మెల్యే బాలకృష్ణ ఆకస్మిక తనిఖీలు

Last Updated : Oct 18, 2021, 7:40 PM IST

ABOUT THE AUTHOR

...view details