ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానలే ప్రధాన ఎజెండాగా తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో గురువారం సమావేశం కానుంది. పార్టీ కేంద్ర కార్యాలయమైన ఎన్టీఆర్ భవన్‌లో చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో వివిధ ప్రజా సమస్యలు చర్చించి తీర్మానాలు చేయనున్నారు. రైతులకు ధాన్యం బకాయిలు పెండింగ్, పంటలకు లభించని గిట్టుబాటు ధర, రైతు సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వం, అంతరాష్ట్ర జల వివాదం, పోలవరం నిర్వాసితులకు పునరావాసం - పరిహారంపై ప్రధానంగా చర్చ జరగనుంది.
కొవిడ్ బాధితులకు పరిహారం చెల్లింపు, కుదేలైన ఆర్ధిక వ్యవస్థ, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, నిత్యావసర ధరల పెరుగుదల, ఖనిజ దోపిడీ, చెత్తపై పన్ను తదితర అంశాలపై పార్టీ వర్గాలు ఈ భేటీలో చర్చించనున్నట్లు సమాచారం. శుక్రవారం (16వ తేదీన) పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై చంద్రబాబు అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. విభజన హామీల అమలు, పెండింగ్ సమస్యల పరిష్కారం, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, తదితర అంశాలను ప్రధానంగా చర్చించనున్నట్లు వెల్లడించాయి.