రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ స్థాయిలో క్షీణించాయో... ఎస్ఈసీ లేఖ ద్వారా స్పష్టమవుతోందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విమర్శించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ చేసిన సూచనలు, ఆదేశాలను ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాచర్ల సీఐ ఇప్పటికీ విధుల్లో కొనసాగుతున్నారని తెలిపారు. దేశంలోని అత్యున్నత వ్యవస్థలను ఖాతరు చేయమన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.
'స్థానిక ఎన్నికలు వాయిదా పడితే ఎందుకంత కంగారు' - వైకాపా ప్రభుత్వంపై తెదేపా విమర్శలు
అధికార వైకాపాపై తెదేపా నేతలు మండిపడ్డారు. స్థానిక ఎన్నికలు వాయిదా పడితే సీఎం జగన్ ఎందుకంత కంగారు పడుతున్నారని రామానాయుడు, పంచుమర్తి అనురాధ ప్రశ్నించారు.
తెదేపాకు సంబంధం ఏంటి?
స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై సుప్రీంకోర్టుకు వెళ్లిన రాష్ట్ర ప్రభుత్వం.. బీసీ రిజర్వేషన్లపై ఎందుకు వెళ్లలేదని తెదేపా అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ నిలదీశారు. బలహీనవర్గాల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏమిటో ఇక్కడే బయటపడిందని విమర్శించారు. రమేశ్‌కుమార్ తనకు భద్రత కావాలని కేంద్రానికి లేఖ రాస్తే... అందుకనుగుణంగా కేంద్ర బలగాలు వచ్చాయని చెప్పారు. దీనికి తెదేపాకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. మాచర్ల ఘటన తామే సృష్టించుకుంటే.. తురక కిశోర్ ఎవరో సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు.