TDP leaders on Narendra arrest: తెదేపా కేంద్ర కార్యాలయ మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్ర అరెస్ట్‌ను తెదేపా అధినేత చంద్రబాబు సహా ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. బ్రిటీష్ పాలన కంటే ఘోరమైన పరిస్థితి ఏపీలో ఉందని చంద్రబాబు అన్నారు. నరేంద్రను సీఐడీ పోలీసులు అరెస్టు చేయడాన్ని ఖండించారు. అక్రమ నిర్బంధాలతో భయపెట్టాలనుకుంటే అది తమ భ్రమ అని ఎద్దేవా చేశారు. కోర్టులు ఎంత చెప్పినా సీఐడీ అధికారుల తీరు మారట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల భావప్రకటన స్వేచ్ఛను అడ్డుకుంటున్నారని అన్నారు. నరేంద్రకు తెదేపా అండగా ఉండి పోరాడుతుందన్నారు.
దారపనేని నరేంద్ర కుటుంబాన్ని తెదేపా సీనియర్ నేత ధూళిపాళ్ల పరామర్శించారు. గుంటూరు అరండల్‌పేటలోని నివాసానికి వెళ్లారు. నరేంద్ర కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. మానసికంగా, శారీరకంగా హింసించడానికే తెదేపానేతలను అరెస్టు చేస్తున్నారంటూ తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి దుయ్యబట్టారు. సీనియర్ జర్నలిస్టు అంకబాబు అరెస్ట్‌ను కోర్టు తప్పుబట్టిన తర్వాత కూడా అదే కేసులో నోటీసులు లేకుండా అరెస్టులా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో జగన్ రెడ్డి అరాచకాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కళా వెంకట్రావ్ మండిపడ్డారు. అర్దరాత్రి దొంగల్లా వెళ్లి నరేంద్ర అరెస్టు చేయటం సిగ్గుమాలిన చర్య అన్న ఆయన.. చట్ట విరుద్దంగా వ్యవహరిస్తున్న సీఐడీ పోలీసులు భవిష్యత్తులో మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.
రాజ్యాంగాన్ని పరిరక్షిస్తూ విద్యార్థులకు ఆదర్శంగా ఉండాల్సిన పోలీసులు.. రాజ్యాంగ వ్యతిరేక విధానాలకు పాల్పడటం సిగ్గుచేటని, నరేంద్ర అక్రమ అరెస్టును విద్యార్థి లోకం హర్షించదని ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు అన్నారు. ప్రభుత్వం నీచమైన కార్యక్రమాలను మానుకోవాలని, అక్రమ అరెస్టులను ఆపాలని పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి డిమాండ్ చేశారు.