వైకాపా పాలనలో ధరాభారంపై ప్రతిపక్ష తెలుగుదేశం ప్రజాపోరాటానికి సిద్ధమైంది. ఈ నెలాఖరు వరకూ 'బాదుడే బాదుడు' పేరుతో చేపట్టాల్సిన నిరసన కార్యక్రమాలపై కార్యకర్తలతో అధినేత చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. జగన్ ప్రభుత్వం ఏడు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి, ప్రజలపై వేల కోట్లు భారం వేసిందని చంద్రబాబు విమర్శించారు. సోమవారం నుంచి మొదలైన నిరసనలను గ్రామ, మండల స్థాయిలో ఈ నెలాఖరు వరకు నిర్వహించాలని స్పష్టం చేశారు. జగన్ ప్రభుత్వ అమలు చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను క్షేత్రస్థాయిలో ఎండగట్టాలని పిలుపునిచ్చారు. విద్యుత్తు ఛార్జీలు, చెత్త, ఇంటి పన్నులు, పెట్రో, గ్యాస్ ధరలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పెంచిన పన్నుల కారణంగా ప్రతి ఇంటిపై రూ. లక్షా పదివేల చొప్పున భారం పడుతోందన్నారు. జగన్ విధానాల వల్లే రాష్ట్రంలో కరెంట్ కొరత, కోతలు ఉన్నాయని ఆక్షేపించారు. ప్రిజనరీ పాలనలో రాష్ట్రం మరో శ్రీలంక కాబోతోందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు.
ధరాభారంపై ప్రచారానికి వివిధ రకాల కరపత్రాలను తెలుగుదేశం రూపొందించింది. తాము అధికారం నుంచి దిగిపోయే సమయానికి ఒక మధ్య తరగతి కుటుంబం బతకడానికి నెలకు రూ. 11వేలు సరిపోయేవని పోస్టర్లలో తెలిపిన తెలుగుదేశం...ప్రస్తుత వైకాపా పాలనలో రూ. 20వేలు ఖర్చవుతోందని చెబుతోంది. సంవత్సరానికి ప్రతి కుటుంబం నుంచి జగన్.. రూ. లక్షా 8 వేలు దోచేస్తున్నట్లు ఆరోపిస్తోంది. 2019 నాటికి సగటు నెల సంపాదన రూ. 15 వేలుంటే ... కుటుంబానికి రూ. 4వేలు మిగులు ఉండేదని.. ఇప్పుడు అదే సగటు సంపాదనకు రూ. 9వేల లోటు ఉంటోందని కరపత్రాల్లో వివరిస్తోంది. నిత్యావసరాల ధరల విషయానికొస్తే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రూ. 80గా ఉన్న వంటనూనె... ఇప్పుడు ఏకంగా రూ. 150 పెరిగి 230 రూపాయలకు చేరడంతో సహా మిగిలిన అన్ని సరుకుల ధరలు గణనీయంగా పెరిగాయని....ఇదే విషయాన్ని ఇంటింటి ప్రచార ద్వారా ప్రజలకు వివరిస్తామని చెబుతోంది. ప్రిజనరీ పాలనలో ఏపీ మరో శ్రీలంక కాబోతోందంటూ పోస్టర్లలో ముద్రించింది.