రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పునరుద్ధరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. నిమ్మగడ్డ దాఖలు చేసిన ధిక్కరణ పిటిషన్‌పై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలుపుదల చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ కేసులో ప్రతి విషయం తమకు తెలసన్న సీజేఐ... కావాలనే స్టే ఇవ్వట్లేదన్నారు. గవర్నర్ లేఖ పంపినా నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌కు పోస్టింగ్ ఇవ్వకపోవడం అత్యంత దారుణంగా అభివర్ణించారు.
ప్రతి విషయం తెలుసు..
నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసులో ప్రతి విషయం మాకు తెలుసు. మేం ఈ కేసులో స్టే ఇవ్వలేం. గవర్నర్ లేఖ పంపినా పోస్టింగ్ ఇవ్వకపోవడం అత్యంత దారుణం.- సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్బోబ్డే
నిమ్మగడ్డ అంశంలో కోర్టు ధిక్కరణ ప్రొసీడింగ్స్ పై స్టే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది శ్యామ్‌దివాన్ కోరారు. అదే సమయంలో రమేశ్ కుమార్ తరపు న్యాయవాది హరీష్ సాల్వే జోక్యం చేసుకుని.. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు, ఆతర్వాత సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం తమ ఇష్టారీతిలో మలుచుకుని వ్యవహరిస్తోందన్నారు. ఈ కేసులో రమేష్ కుమార్‌ని తిరిగి నియమిస్తే.. తాము వేసిన కేసు రద్దై పోతుందని ప్రభుత్వం చెప్పుకొస్తోందన్నారు. హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వక పోయినా.. కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయటం లేదని హరీశ్ సాల్వే వివరించారు.
కోర్టు ధిక్కరణే..!
ఇరుపక్షాల వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో స్టే ఇవ్వట్లేదన్నారు. గవర్నర్ లేఖ పంపినా రమేష్ కుమార్‌కు పోస్టింగ్ ఇవ్వకపోవడం, కోర్టులతోనే కాకుండా.. గవర్నర్‌తో కూడా చెప్పించుకోవాలా అని సీజేఐ వ్యాఖ్యానించారు. గతంలో నిమ్మగడ్డ నియామకానికి సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించామని సీజేఐ గుర్తు చేశారు. హైకోర్టు ఆదేశాలు పాటించకపోతే... అది కోర్టు ధిక్కరణ కిందికే వస్తుందని సీజేఐ అన్నారు.
ఈ సందర్భంలో హరీష్ సాల్వే మరోసారి జోక్యం చేసుకుంటూ.. తీర్పు ఇచ్చిన హైకోర్టు న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాలతో పాటు.. మీడియాలో కూడా న్యాయస్థానాలు, న్యాయమూర్తులు, కోర్టు ఉత్తర్వులపై ఇష్టారీతిలో మాట్లాడుతున్నారని ధర్మాసనానికి తెలిపారు. తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులను కరోనా రోగులతో కలిపి గదిలో బంధించాలని పలువురు నేతలు వ్యాఖ్యానించారన్నారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. ప్రభుత్వం లేవనెత్తిన అంశాలతో పాటు.. హైకోర్టు తీర్పు తర్వాత పరిణామాలపై అఫిడవిట్ దాఖలు చేయాలని హరీష్ సాల్వేని ఆదేశించింది. కేసు విచారణను వారం రోజులు వాయిదా వేసింది.