స్థానిక ఎన్నికలను 6 వారాల పాటు వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. తమను సంప్రదించకుండానే రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకొందని, ఆయా ఉత్తర్వులు నిలిపేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బొబ్డే, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున అదనపు సొలిసిటర్ జనరల్ నాదకర్ని, రాష్ట్ర ఎన్నికల సంఘం తరపున సీనియర్ న్యాయవాది శేఖర్ నాఫడే వాదనలు వినిపించారు. ఎస్ఈసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రందించకుండా స్థానిక ఎన్నికలను వాయిదా వేసిందని నాదకర్ణి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కరోనాను దృష్టిలో ఉంచుకొని ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్న వాయిదా నిర్ణయం జోలికి వెళ్లబోమని సీజేఐ జస్టిస్ బొబ్డే స్పష్టం చేశారు.
ఎన్నికల నియమావళి కారణంగా పాలనకు ఇబ్బందికరమని ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఎన్నికల నిర్వహణ తేదీ తెలీకుండా ఎస్ఈసీ ఎన్నాళ్లు ఎన్నికల నియమావళి అమలులో ఉంచుతుందని ప్రశ్నించారు. ప్రభుత్వానికి పాలనాపరమైన ఇబ్బందులు సృష్టించేందుకు ఎన్నికల సంఘం రాజకీయ కోణంలో వెళ్లిందని వాదించారు. ఎన్నికల నియమావళిని 6 వారాల పాటు ఎలా కొనసాగిస్తారని న్యాయమూర్తులు ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించారు. గతంలో పార్లమెంట్ ఎన్నికల వేళ 4 నెలల పాటు కోడ్ అమల్లో ఉందని ఎస్ఈసీ తరపు న్యాయవాది శేఖర్ మాఫడే వివరించారు. ఎన్నికల ప్రక్రియ వాయిదా మాత్రమే వేశామని, పూర్తిస్థాయిలో రద్దు చేయనందున కోడ్ కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. తదుపరి ప్రక్రియ సైతం పారదర్శకంగా నిర్వహించేందుకే ఎన్నికల నియమావళిని కొనసాగిస్తున్నామన్నారు.