ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పోలవరం ముంపుపై కేంద్రం జోక్యం చేసుకోవాలి - పోలవరం ప్రాజెక్టు నిర్మాణం

POLAVARAM PETITIONS HEARING : పోలవరం ముంపుపై కేంద్రం జోక్యం చేసుకోవాలని సుప్రీం కోర్టు పేర్కొంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై సరిహద్దు రాష్ట్రాలు వేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పోలవరంపై వాస్తవాలతో కూడిన నివేదిక అందించాలని కేంద్ర జలశక్తి శాఖకు ఆదేశాలిచ్చింది.

HEARING ON POLAVARAM PETITIONS IN SC
HEARING ON POLAVARAM PETITIONS IN SC

By

Published : Sep 6, 2022, 3:27 PM IST

Updated : Sep 7, 2022, 6:41 AM IST

పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల సమస్యలపై ప్రభావిత రాష్ట్రాలన్నింటితో కేంద్రం వెంటనే చర్చించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం ఆదేశించింది. ‘ఈ ప్రాజెక్టుపై తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ విభిన్న సమస్యలను ప్రస్తావించాయి. దీనివల్ల కొన్ని ప్రాంతాల్లో వరద ముంపు తలెత్తుతున్నట్లు పేర్కొన్నాయి. ప్రాజెక్టును తొలుత చెప్పినట్లు కాకుండా.. భారీగా విస్తరించడంతో ముంపు సమస్య పెరుగుతోందని చెప్పాయి. అందువల్ల తొలుత ఇచ్చిన పర్యావరణ అనుమతులను పునఃసమీక్షించాలని కోరాయి.

కేంద్ర జల్‌శక్తి, పర్యావరణ శాఖలు భాగస్వాములందరితో ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటుచేసి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. అవసరమైతే ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమై.. మిగిలిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవచ్చు. భాగస్వామ్య పక్షాల తొలి సమావేశం ఈ నెలలోనే ప్రారంభమవ్వాలి. తర్వాత తరచూ సమావేశాలు నిర్వహించి తదుపరి విచారణ కంటే ముందే నివేదిక సమర్పించాలి’ అని జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబరు 7కు వాయిదా వేసింది.

పోలవరం ప్రాజెక్టువల్ల తమ రాష్ట్రాల్లో వరద ముంపు తలెత్తుతున్నందున పరిష్కార మార్గాలు చూపాలని కోరుతూ ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ దాఖలు చేసిన వ్యాజ్యాలతోపాటు, ఈ ప్రాజెక్టుకు ఇచ్చిన పర్యావరణ అనుమతులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఒడిశా దాఖలు చేసిన వ్యాజ్యకాలీన దరఖాస్తులపై మంగళవారం జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ అభయ్‌ శ్రీనివాస్‌ ఓక్‌, జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. తొలుత ఒడిశా తరఫున సీనియర్‌ న్యాయవాది గోపాల సుబ్రహ్మణ్యం వాదనలు వినిపిస్తూ.. ‘బచావత్‌ అవార్డుకు అతీతంగా ఆంధ్రప్రదేశ్‌ పోలవరం రూపురేఖలను మార్చింది. ఈ మార్పులవల్ల ఒడిశా ప్రజలు ముంపుబారిన పడుతున్నారు. 2005లో ఇచ్చిన పర్యావరణ అనుమతులతో పోలిస్తే.. ప్రస్తుతం దాని పరిధి పూర్తిగా మారిపోయిందని కేంద్రం ఒకానొక దశలో నిర్మాణ పనులను నిలిపేయాలని ఉత్తర్వులిచ్చింది.

తదుపరి ఉత్తర్వులు జారీచేసే వరకూ నిర్మాణ పనులు చేపట్టకూడదని ఏపీ ప్రభుత్వాన్ని నిర్దేశించింది. ఆ తర్వాత పర్యావరణశాఖ ఈ నిలిపివేత ఉత్తర్వులను ఏటా తాత్కాలికంగా పక్కనబెట్టి నిర్మాణ పనులకు అనుమతులిస్తోంది. దీన్ని బట్టి ఈ ప్రాజెక్టుకు అధికారిక పర్యావరణ అనుమతులు ఉన్నాయా.. ముంపు ప్రాంతాల గురించి శాస్త్రీయ అధ్యయనం చేయకుండా ప్రాజెక్టు నిర్మాణాన్ని కొనసాగించే అవకాశం ఉందా.. అని మేం అడుగుతున్నాం.

ఈ కేసు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిందే తప్ప జలాల పంపిణీకి సంబంధించింది కాదు. బచావత్‌ ట్రైబ్యునల్‌ అవార్డు ప్రకారం పోలవరం ప్రాజెక్టు ఎగువన రెండు ప్రాజెక్టులు నిర్మించాలి. అప్పుడు గోదావరి నదిలో నీటిమట్టం ఒక స్థాయి వరకూ ఉంటుంది. ఇప్పుడు పోలవరం ఒక్కటే నిర్మిస్తున్నందున ఒడిశా ప్రజలు ముంపుబారిన పడతారు. 1994 పర్యావరణ ప్రభావ మదింపు నోటిఫికేషన్‌ పరిధిలోకి వచ్చే ఈ ప్రాజెక్టును స్పష్టమైన పర్యావరణ అనుమతులు లేకుండా నిర్మిస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయన్నది మీరే పరిగణనలోకి తీసుకుని తగు ఉత్తర్వులివ్వాలి. సమస్యల పరిష్కారానికి సీఎస్‌లు సమావేశం కావాలన్న సూచనను మేం అంగీకరిస్తున్నాం.

చెప్పిన దానికి భిన్నంగా 36లక్షల క్యూసెక్కుల డిశ్చార్జి స్థాయి నుంచి 50 లక్షల క్యూసెక్కుల డిశ్చార్జి స్థాయికి ప్రాజెక్టును విస్తరించి నిర్మిస్తే ఇబ్బందులు తలెత్తుతాయి. అందువల్ల అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకోవాలి. ఎప్పుడైనా ప్రాజెక్టులో విస్తృతమైన మార్పులు చేసినప్పుడు తాజా పర్యావరణ అనుమతులు పొందాలి. అందుకోసం ప్రజాభిప్రాయసేకరణ చేపట్టాలి’ అని కోరారు.

ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపేయాలని కోరడం లేదు: తెలంగాణ
తెలంగాణ తరఫున సీనియర్‌ న్యాయవాది వైద్యనాథన్‌ వాదనలు వినిపిస్తూ.. తాము ఒడిశాలా ప్రాజెక్టు నిర్మాణ పనులను నిలిపేయాలని కోరడం లేదని, ముంపు సమస్యను పరిష్కరించేంతవరకూ ప్రాజెక్టులో నీళ్లు నిల్వ చేయొద్దని కోరుతున్నామని పేర్కొన్నారు. ‘గోదావరిలో వరద ప్రభావం 50 లక్షల క్యూసెక్కుల వరకూ ఉంటుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. దానివల్ల ఎక్కువ ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఇటీవల వచ్చిన వరదలకు భద్రాచలం ఆలయం పూర్తిగా మునిగింది. నీరు నిలబెట్టడానికి ముందే చుట్టుపక్కల రాష్ట్రాల్లో తలెత్తే ముంపు గురించి పర్యావరణ ప్రభావ మదింపును చేపట్టాలి’ అని కోరారు. ఛత్తీస్‌గఢ్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. రిజర్వాయరు నిర్మాణ పరిధిని 150 అడుగుల నుంచి 177 అడుగులకు పెంచడంతో బ్యాక్‌వాటర్‌ ముంపు పెరుగుతోందని పేర్కొన్నారు.

ఇప్పటికే రూ.20వేల కోట్లు ఖర్చయింది... ఇంకా రూ.30వేల కోట్లు ఖర్చు చేయాలి: ఏపీ
ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది వెంకటరమణి వాదనలు వినిపిస్తూ.. ‘ఇది కేంద్ర నిధులతో నిర్మిస్తున్న ప్రాజెక్టు తప్ప ఆంధ్రప్రదేశ్‌ చేపడుతున్నది కాదు. ఇప్పటివరకు రూ.20వేల కోట్లు ఖర్చు చేశారు. ఇంకా రూ.30వేల కోట్లు ఖర్చు చేయాలి. ఇది కేంద్ర ప్రాజెక్టు కాబట్టి.. ఇందులో ఉన్న వివాదాస్పద అంశాల పరిష్కారానికి రాష్ట్రాల సీఎస్‌లతో కేంద్రం ఓ సమావేశం ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అదే క్రమంలో పర్యావరణ అనుమతుల సమస్యనూ పరిష్కరించడానికి వీలవుతుంది’ అని పేర్కొన్నారు.
ఈ వాదనలన్నీ విన్న తర్వాత.. భాగస్వామ్య పక్షాలన్నింటితో కేంద్రం ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌ ఆదేశాలు జారీ చేశారు.

ఇవీ చదవండి:

Last Updated : Sep 7, 2022, 6:41 AM IST

ABOUT THE AUTHOR

...view details