Subject teachers Shortage: రాష్ట్రవ్యాప్తంగా 2,114 పాఠశాలలు ఉండగా.. వీటిలో 335 ఉన్నత పాఠశాలలు. వీటికి 12ఏళ్ల క్రితం అప్పటి అవసరాన్ని బట్టి పోస్టులను మంజూరుచేశారు. విద్యార్థుల సంఖ్య పెరిగినా అదనంగా పోస్టులను మంజూరు చేయలేదు. అన్ని పాఠశాలల్లో కలిపి స్కూల్ అసిస్టెంట్ల పోస్టులు 5,379 ఉండగా.. వీటిలోనే 522 ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రంలోని పురపాలక పాఠశాలల్లో 2,400 మంది సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత ఉన్నట్లు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయమే ఇటీవల ప్రకటించింది. గతేడాది పురపాలక సంఘాల తరఫున విద్యా వాలంటీర్లను నియమించడంతో కొంతవరకూ సమస్య పరిష్కారమైంది. ఈసారి వారిని ఇవ్వలేదు. సబ్జెక్టు ఉపాధ్యాయులు అవసరమని ప్రధానోపాధ్యాయులు కోరుతున్నా హేతుబద్ధీకరణ తర్వాత ఇస్తామని జిల్లా విద్యాధికారులు సమాధానమిస్తున్నారు. పాఠశాలలు పునఃప్రారంభమై దాదాపు రెండు నెలలు గడుస్తోంది. ఇప్పటికీ పూర్తిస్థాయిలో సిబ్బంది లేకపోతే బోధన ఎలాగని పురపాలక ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. కొన్నిచోట్ల రెండు, మూడు సెక్షన్లను కలిపి బోధిస్తున్నారు. ఇంకొన్నిచోట్ల 9, 10 తరగతులకే ప్రాధాన్యం ఇస్తున్నారు. మరికొన్నిచోట్ల వేరే సబ్జెక్టుల ఉపాధ్యాయులతో పాఠాలు చెప్పిస్తున్నారు.
‘నాడు-నేడు’లో మంజూరైనా తప్పని ఇబ్బందులు:రెండోవిడత ‘నాడు-నేడు’ కింద పాఠశాలలకు అదనపు గదులు మంజూరు చేసినా చాలాచోట్ల ఇంతవరకూ పనులు ప్రారంభం కాలేదు. మదనపల్లె నీరుగట్టువారిపల్లెలో రామిరెడ్డి లేఅవుట్‌లో ఉన్న వివేకానంద పురపాలక ఉన్నత పాఠశాలలో 22 గదులున్నాయి. ఇందులో నాలుగు గదులు ఇతర అవసరాలకు పోను, విద్యార్థులకు 18 గదులే ఉన్నాయి. రెండోవిడత నాడు-నేడు కింద పాఠశాలకు 17 గదుల నిర్మాణానికి రూ.2.04 కోట్లు మంజూరుచేశారు. స్థల సమస్యతో నిర్మాణాలు ప్రారంభం కాలేదు. దీంతో విద్యార్థులు ఇరుకిరుగ్గా కూర్చోవాల్సి వస్తోంది. ఆదోనిలో ఆర్‌ఆర్ లేబర్ కాలనీలోని పాఠశాలలో 10సెక్షన్లకు ఏడు గదులే ఉన్నాయి. ‘నాడు-నేడు’ కింద 20 గదులు మంజూరు చేసినా పనులు ప్రారంభం కాలేదు. దీంతో తాత్కాలికంగా ఏర్పాటుచేసిన రేకుల షెడ్లు, పాఠశాల ఆవరణలోనూ తరగతులు నిర్వహిస్తున్నారు. నెల్లూరు కేఎన్‌ఆర్ పురపాలక పాఠశాలలోనూ తరగతి గదుల కొరతతో చెట్ల కింద తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం రూ.2.26 కోట్లతో 20గదుల నిర్మాణ చేపట్టింది. కాకినాడ ఎస్‌ఆర్‌కే ఉన్నత పాఠశాలలో గతంలో పురపాలక నిధులతో చేపట్టిన నాలుగు గదుల నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయింది. ‘నాడు-నేడు’ కింద 20 గదులు మంజూరుచేసినా పనులు ప్రారంభం కాలేదు. దీంతో మూడు సెక్షన్ల విద్యార్థులను రెండు సెక్షన్లుగా సర్దుబాటు చేసి, పాఠాలు బోధిస్తున్నారు.
మరికొన్ని ఉదాహరణలు ఇలా..
* నెల్లూరు కేఎన్‌ఆర్ పురపాలక ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు, గదుల కొరతతో ఏదో ఒక తరగతికి రోజూ సెలవు ఇస్తున్నారు. 1,893 మంది విద్యార్థులకు 65మంది ఉపాధ్యాయులు అవసరం కాగా.. 35 మంది ఉన్నారు.
* కర్నూలు జిల్లా ఆదోని ఆర్‌ఆర్ లేబర్ కాలనీలోని పురపాలక ఉన్నత పాఠశాలలో 820 మంది విద్యార్థులున్నారు. 18 మంది ఉపాధ్యాయులు అవసరం కాగా.. రెగ్యులర్ ఉపాధ్యాయులు నలుగురే ఉన్నారు. ఉపాధ్యాయులు, దాతల సహకారంతో మరో నలుగుర్ని తాత్కాలికంగా నియమించుకుని బోధన సాగిస్తున్నారు.