జీవో ఎందుకంటే..
ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలపై విద్యార్థులు నిరీక్షణ - ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల వార్తలు
రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీడీఎస్‌లలో ప్రవేశాలపై అనిశ్చితి నెలకొంది. నీట్‌లో అర్హత మార్కులు సాధించిన రాష్ట్ర విద్యార్థుల జాబితాను విశ్వవిద్యాలయం వెల్లడించి వారాలు గడిచిపోతున్నా ప్రవేశాల నోటిఫికేషన్ రాకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రవేశాల నిర్వహణకు సంబంధించి సవరణ జీవో రానందున విశ్వవిద్యాలయం ప్రవేశాల ప్రకటన జారీ నిలిచిపోయింది. డిసెంబరు 15 నుంచి ప్రథమ సంవత్సరం తరగతులు ప్రారంభించాలని ఎన్‌ఎంసీ (ఎంసీఐ) రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. తెలంగాణలో విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ధ్రువపత్రాల పరిశీలన ఈ నెల 13తో ముగియనుంది. తమిళనాడు, ఇతర రాష్ట్రాల్లోనూ కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలైంది. మరోవైపు జాతీయ కోటాలో తొలి విడత కౌన్సెలింగ్ ద్వారా సీట్లను కేటాయించగా విద్యార్థులు కళాశాలల్లో చేరుతున్నారు. కానీ రాష్ట్రంలోనే ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కాలేదు.
ఏటా ఎంబీబీఎస్/ బీడీఎస్ ప్రవేశాలను 2001లో జారీ చేసిన జీవో 550 ద్వారా చేపడుతున్నారు. ఇందులో ఓపెన్ కేటగిరీలో ప్రతిభ కలిగిన మెరిటోరియస్ రిజర్వుడు విద్యార్థి (ఎంఆర్‌సీ).. బీసీ/ఎస్సీ/ఎస్టీ కేటగిరీలో సీటు సాధించినా, తిరిగి రిజర్వేషన్ కేటగిరీ కౌన్సెలింగ్‌లో హాజరై మెరుగైన కళాశాలలో సీటుకు స్లైడింగ్ అయ్యే అవకాశం ఉంది. అలా వదిలేసిన సీటును అదే కేటగిరీ (బీసీ/ ఎస్సీ/ ఎస్టీ) విద్యార్థులతోనే భర్తీ చేస్తారు. మెరుగైన కళాశాలలో సీటు పొందిన ఎంఆర్‌సీ విద్యార్థి చేరకపోతే అది ఓపెన్ కేటగిరీ విద్యార్థితో భర్తీ అవుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఓపెన్ కేటగిరీలో రిజర్వేషన్ అభ్యర్థులు పొందిన సీటును ఓసీ అభ్యర్థులదిగానే పరిగణిస్తున్నారు. సీట్ల ప్రక్రియలో పారదర్శకత తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గతేడాది జీవో 550లో మార్పులు చేస్తూ అనుబంధ జీవో 111ను విడుదల చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఏర్పడిన ఉన్నతస్థాయి కమిటీ దీనిలో కొద్ది మార్పులు చేసింది. ఈ నివేదిక ప్రభుత్వ పరిశీలనలో ఉంది. జీవో ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని విశ్వవిద్యాలయ వర్గాలు తెలిపాయి. జీవో వచ్చేలోగా దరఖాస్తులు ఆహ్వానించి మెరిట్ లిస్టు ప్రకటిస్తే.. సీటు వస్తుందా లేదా అనేదానిపై విద్యార్థులు ఓ అవగాహనకు వచ్చేందుకు అవకాశం ఏర్పడుతుంది. మరోవైపు కొవిడ్ దృష్ట్యా ఈ ఏడాది అభ్యర్థులు కౌన్సెలింగ్ కేంద్రాలకు రావాల్సిన అవసరం లేకుండా విశ్వవిద్యాలయం ఏర్పాట్లు చేసింది. అప్‌లోడ్ చేసిన పత్రాలను సంబంధిత అధికారులు సరిచూస్తారు. ఆ తరువాత విద్యార్థుల నుంచి ఆప్షన్లు స్వీకరిస్తారు.
ఇదీ చదవండి:ప్రాథమిక దర్యాప్తు చేయకుండా అరెస్ట్ చేస్తారా..?- హైకోర్టు