వేసవి సెలవులు ముందు వరకు ఉన్న బడి ఇప్పుడు మాయమైపోయింది. పాఠశాల తరలిపోయిందని ఉపాధ్యాయులు చెప్పడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. ఎవరు ఏ బడికి వెళ్లాలో తెలియని పరిస్థితి. దీంతో పాఠశాలలు తెరచుకున్న తొలిరోజునే.. పలు చోట్ల నిరసనలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వం పలు పాఠశాలలను విలీనం చేయడంతో విద్యార్థులు కిలోమీటర్ల కొద్దీ ప్రయాణించాల్సిన దుస్థితి.. ఆడపిల్లల చదువు మధ్యలోనే ఆగిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తల్లిదండ్రులకు రవాణా ఛార్జీలు భారంగా మారనున్నాయి. ప్రాథమిక బడుల నుంచి 3, 4, 5 తరగతులను ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లోనూ, ప్రాథమికోన్నత బడుల నుంచి 6, 7, 8 తరగతులను ఉన్నత పాఠశాలల్లోనూ విలీనం చేసేశారు. విద్యార్థుల సంఖ్య పెరిగితే పాఠాలు ఎలా అర్థమవుతాయనే దాన్ని గాలికొదిలేశారు. ఉపాధ్యాయులు, పాఠశాలల సంఖ్యను తగ్గించడంపైనే దృష్టిసారించారు.
చెప్పిందొకటి.. చేస్తోందొకటి..
జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ) అమలు పేరుతో ప్రాథమిక పాఠశాలను విచ్ఛిన్నం చేస్తున్నారు. కరికులమ్, బోధనా విధానాల అమలు కోసమే పాఠశాల విద్యను ఎన్‌ఈపీ నాలుగు స్థాయిలుగా విభజించింది. పాఠశాలను భౌతికంగా విభజించాల్సిన అవసరం లేదని కేంద్ర పాఠశాల విద్యాశాఖ చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఉపాధ్యాయులు, పాఠశాలల సంఖ్యను తగ్గించుకునేందుకు చూస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 42,000 పాఠశాలలు భవిష్యత్తులో 11,000కు తగ్గిపోనున్నాయి. ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను ఈ ఏడాది కిలోమీటరు దూరంలోని ప్రాథమికోన్నత, ఉన్నత బడుల్లో విలీనం చేస్తున్నారు. ఇప్పటికే 250 మీటర్ల దూరంలోని 3,627 ప్రాథమిక బడుల నుంచి 3, 4, 5 తరగతులను 3,178 ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. ఇప్పుడు కిలోమీటరు దూరంలోని 8,412 ప్రాథమిక పాఠశాలల నుంచి 3, 4, 5 తరగతులను తరలిస్తున్నారు. ఇదికాకుండా 6, 7, 8 తరగతుల్లో 100లోపు విద్యార్థులు ఉంటే వీరిని 3 కిలోమీటర్ల దూరంలోని ఉన్నత పాఠశాలల్లో కలిపేస్తున్నారు. దీంతో ఇప్పటి వరకు ఊళ్లో అందుబాటులో ఉన్న పాఠశాలలు మూతపడుతున్నాయి. అధికారులు ప్రస్తుతం ఉన్న పాఠశాల నుంచి కిలోమీటరు, మూడు కిలోమీటర్ల దూరాన్ని మాత్రమే లెక్కేస్తున్నారే తప్ప పిల్లలు ఇంటి నుంచి రావలసిన దూరాన్ని పట్టించుకోవడం లేదు. బడికి వెళ్లాలంటే వారు పడే ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోవడం లేదు. చిన్నారులు హైవేలను, ప్రధానరోడ్లను, వాగులు, వంకలను దాటాల్సి వస్తుందనే ఆలోచనే చేయడం లేదు.
తరగతి గదులు లేకపోయినా..
అదనపు తరగతి గదులు లేకపోయినా కొన్నిచోట్ల రికార్డులను మార్చేస్తున్నారు. ‘నాడు-నేడు’ రెండో విడతలో 9,000కు పైగా అదనపు తరగతి గదులు నిర్మించాలని నిర్ణయించారు. ఈ పనులు ఇప్పుడే ప్రారంభమయ్యాయి. కానీ తరగతి గదులు లేకపోయినా రికార్డులను విలీన పాఠశాలల్లో అప్పగించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. హేతుబద్ధీకరణలో మిగులుగా తేలిన ఉపాధ్యాయులను ఆయా బడుల్లో పాఠాలు చెప్పేందుకు కేటాయించాలని నిర్ణయించారు.
ఆందోళన.. హామీ
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కేతనకొండ పాఠశాల నుంచి 3, 4, 5 తరగతులను 2 కిలోమీటర్ల దూరంలోని చిలుకూరులో విలీనం చేశారు. నిబంధనల ప్రకారం కిలోమీటరు వరకే మార్చాల్సి ఉండగా.. ఇక్కడ అంతకుమించి దూరం పంపేశారు. మంగళవారం పిల్లలను తీసుకుని వచ్చిన తల్లిదండ్రులు ఈ విషయం తెలిసి ఆందోళన చేయడంతో విలీనాన్ని మారుస్తామని అధికారులు హామీ ఇచ్చారు.
ప్రజలే బడులను రక్షించుకోవాలి: ఏపీటీఎఫ్
‘‘పాఠశాలల మూసివేత దిశగా అధికారులు చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు అడ్డుకోవాలి. ఇప్పటికే రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. ఇది అధికారులకు కనబడటం లేదా? పాఠశాలల పరిరక్షణకు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలతోపాటు తల్లిదండ్రులు ముందుకురావాలి’’- మంజుల, భానుమూర్తి, అధ్యక్ష, కార్యదర్శులు, ఉపాధ్యాయ సమాఖ్య
విలీనాన్ని వ్యతిరేకిస్తూ పాఠశాలకు తాళం
చిత్తూరు జిల్లా గంగవరం మండలం బండమీదజరావారిపల్లెలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను 2.5 కి.మీ. దూరంలోని కీలపట్ల ఉన్నత పాఠశాలలో కలపడాన్ని వ్యతిరేకిస్తూ గ్రామస్థులు బడికి తాళం వేశారు. ఇక్కడ 110 మంది విద్యార్థులు ఉన్నా సరిపడా భవనాలు ఉన్నాయి. అయినా అధికారులు ఈ పాఠశాలను మరోచోటకు బదిలీ చేయడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్థులు మంగళవారం బడి ఎదుట బైఠాయించారు. ఈ పరిసరాల్లో తరచూ ఏనుగులు సంచరిస్తుంటాయని అంతదూరం పిల్లలు నడిచి వెళ్లడం ప్రమాదకరమని వారు పేర్కొన్నారు.