SCHOOLS PROTEST: ప్రాథమిక స్కూళ్లను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడంపై ఆందోళనలు వెల్లువెత్తున్నాయి. అంతకుముందు సొంతూళ్లో బడికి వెళ్లిన చాలామంది విద్యార్థులు ఇప్పుడు ఒకట్రెండు కిలోమీటర్ల దూరంలోని బడులకు వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏలూరు: పాఠశాలలు విలీనాన్ని వ్యతిరేకిస్తూ.. ఏలూరు జిల్లా పెదవేగి మండలంలోని విజయరాయి, ముత్తనవీడులో విద్యార్థులు, తల్లిదండ్రులు రోడ్డెక్కారు. పాఠశాలలు విలీనంతో.. చిన్నపిల్లలకు చదువు భారంగా మారుతుందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. 3, 4, 5వ తరగతి పిల్లలు దూరంగా ఉన్న స్కూలుకు వెళ్లాలంటే ఇబ్బంది పడాల్సి వస్తుందని వాపోయారు. ప్రస్తుతం ఉన్న పాఠశాలలోనే 3,4,5వ తరగతులు కొనసాగించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.
పల్నాడు: 3, 4, 5 తరగతులను ప్రాథమికోన్నత పాఠశాలలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ.. పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం వేల్పూరు, క్రోసూరు మండలం అనంతవరం గ్రామంలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. వేల్పూరులో సత్తెనపల్లి రహదారిపై బైఠాయించి.. పాఠశాలల విలీనానికి వ్యతిరేకంగా రాస్తారోకో చేశారు. సమీపంలోని పాఠశాలను.. సుదూర ప్రాంతానికి తరలించడాన్ని నిరసిస్తూ తరగతి గదులకు తాళాలు వేశారు. 3,4,5 తరగతులు ప్రాథమికోన్నత పాఠశాలలో విలీనం చేయోద్దని డిమాండ్ చేశారు.
శ్రీకాకుళం జిల్లాలోని మొగిలిపాడు, ఉదయపురం పాఠశాలలను.. పలాస జడ్పీ హైస్కూల్లో విలీనం చేయడంపై.. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో నిరసన చేపట్టారు. ఆందోళనతో పలాసలోని రహదారిపై.. సుమారు 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఊళ్లోని పాఠశాలలను వేరే చోట విలీనం చేస్తే.. తమ పిల్లలను ఎక్కడ చదివించాలని తల్లిదండ్రులు ప్రశ్నించారు. విలీనం నిర్ణయాన్ని మార్చుకోకుంటే మరింత ఉద్యమిస్తామని హెచ్చరించారు.
అల్లూరి సీతారామరాజు: మౌలిక సదుపాయాలు లేవంటూ.. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం సీతాపురంలో.. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఎయిడెడ్ పాఠశాల విలీనం కావడంతో.. విద్యార్థుల సంఖ్య పెరిగిందని.. 140 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు మాత్రమే ఉన్నారని గ్రామస్తులు ఆరోపించారు. అధ్యాపకుల కొరతతో విద్యార్థులకు పూర్తిస్థాయిలో చదువు అందడం లేదని వాపోయారు. పెరిగిన విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాలు, ఉపాధ్యాయులను కేటాయించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.