ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ప్రభుత్వ ఉద్యోగులపై కక్ష సాధింపు దుర్మార్గ చర్య' - ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు వార్తలు

రాష్ట్ర ప్రభుత్వం కొందరు అధికారులపై పనికట్టుకుని కక్ష సాధిస్తోందని తెలుగుదేశం నేతలు ఆరోపించారు. ఉద్యోగులపై కక్ష సాధింపు దుర్మార్గ చర్య అని మండిపడ్డారు. ప్రభుత్వం కక్ష సాధింపులు ఆపకపోతే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు.

tdp leaders
tdp leaders

By

Published : Feb 9, 2020, 7:15 PM IST

Updated : Feb 9, 2020, 11:33 PM IST

వైకాపా సర్కారుపై తెదేపా నేతల విమర్శలు

సీనియర్‌ ఐపీఎస్ అధికారి వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్‌ వేటు వేయడం ప్రభుత్వ కక్ష సాధింపు చర్యని తెలుగుదేశం ఆరోపించింది. భద్రతా ఉపకరణాలు కొనుగోలులో అక్రమాలు జరిగితే విచారణ చేసేందుకు 8 నెలలు పట్టిందా అని ఆ పార్టీ సీనియర్‌ నేత వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పాలనపై దృష్టి సారించకుండా వైకాపా నేతలు కక్షసాధింపులే లక్ష్యంగా పనిచేస్తున్నారంటూ వర్ల ఆరోపించారు. అధికారం శాశ్వతం కాదన్న ఆయన సర్కారు చర్యలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్‌ ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. ఏ తప్పు చేయకుండా పోలీసులను 7 నెలలుగా ఎందుకు వీఆర్‌లో ఉంచారని ప్రశ్నించారు. 3 నెలలు వీఆర్‌లో ఉంటే జీతాలు ఇవ్వమంటే... వారు ఎలా బతుకుతారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉద్యోగుల పొట్ట కొట్టొద్దు

ప్రభుత్వం కొందరు అధికారులపై పని కట్టుకుని కక్ష సాధిస్తోందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ఆరోపించారు. అధికారులపై కోపంతో వారి పొట్ట కొట్టే విధంగా ఏ ప్రభుత్వం చేయలేదని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో చేసిన అధికారులను వీఆర్‌కు పంపారని వెల్లడించారు. అధికారులపై కక్ష సాధింపులు ఆపకపోతే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

వారిపైనే కక్ష

ఉద్యోగులపై కక్ష సాధింపు దుర్మార్గ చర్యని మండలిలో తెదేపా పక్షనేత యనమల రామకృష్ణుడు ట్వీట్ చేశారు. గత ప్రభుత్వంలో పనిచేసిన ఉద్యోగులపై కక్ష సాధించడం గర్హనీయమన్నారు. ఉద్యోగులకు రాజకీయాలను ఆపాదించరాదని హితవు పలికారు. ఒక వ్యక్తి కక్ష సాధింపునకు రాష్ట్రాన్ని బలి చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇలాంటి దుర్మార్గాలను ఉద్యోగ సంఘాలు అడ్డుకోవాలని సూచించారు.

దేనికి సంకేతం

సీనియర్ ఐపీఎస్‌ అధికారి వెంకటేశ్వరరావును సస్పెండ్ చేయడం దారుణమని తెదేపా నేత చినరాజప్ప అన్నారు. ప్రభుత్వం నిరంకుశ వైఖరితో పాలన సాగిస్తోందని విమర్శించారు. సీఎం జగన్ ఉద్యోగులను భయపెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. 170 మంది పోలీసులకు పోస్టింగ్ ఇవ్వకుండా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని వివరించారు. 3 నెలలు హాజరుకాకపోతే జీతం ఇవ్వొద్దని జీవో తేవడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. పోలీసు అధికారుల సంఘం దీనిపై స్పందించాలని కోరారు.

ఇదీ చదవండి:

పరాకాష్ఠకు వైకాపా ప్రభుత్వ ఫ్యాక్షనిస్ట్ ధోరణి: చంద్రబాబు

ఇంటెలిజెన్స్ మాజీచీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్

Last Updated : Feb 9, 2020, 11:33 PM IST

ABOUT THE AUTHOR

...view details